బెంగళూరు చెరువు వింత కథ




ఒకసారి నిప్పులు, మరోసారి నురగలు

పరిష్కారంపై కర్ణాటక ప్రభుత్వానికి ఎన్‌జీటీ నోటీసులు  




సాక్షి, బెంగళూరు: ఐటీ నగరి బెంగళూరులోని ఒక చెరువు వింతపోకడ కర్ణాటక ప్రభుత్వానికి చిక్కులు తెస్తోంది. ఆ చెరువు ఒకసారి భారీఎత్తున మంటలు, పొగతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోసారి నురగలు కక్కుతూ ముచ్చెమటలు పట్టిస్తోంది. బెంగళూరులోని బెల్లందూరు చెరువు నుంచి తరచూ వస్తున్న నురగపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు సైతం జారీ చేసింది.



ఇటీవల వర్షాలతో బెల్లందూరు చెరువు మళ్లీ భారీ ఎత్తున నురగలు కక్కుతోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఫిబ్రవరిలో చెరువులో వారంరోజులకు పైగా భారీస్థాయిలో పొగ, మంటలు లేచాయి. దీంతో జనం భయాందోళనలకు గురయ్యారు. సమీప నివాసాలు, వాణిజ్య ప్రాంతాలు, ఫ్యాక్టరీల నుంచి టన్నుల కొద్దీ వస్తున్న చెత్త, మురుగువల్ల చెరువు కలుషితమవుతోంది. అదే దీనికి కారణమని చెబుతున్నారు.



నురగపై ఎన్‌జీటీ తాఖీదులు

తాజాగా నురగ సమస్యపై ఎన్‌జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ‘బెల్లందూరు చెరువు సమస్యకు గతంలో కొన్ని పరిష్కార మార్గాలను సూచించాం. చెరువులో ఉన్న వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేయాలని చెప్పాం. అయినా చర్యలు లేవు. ఈ నురగ సమస్యకు మీరు చూపే పరిష్కారం ఏమిటి?’ అని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇప్పటికే చర్యలు చేపట్టామని, ఒకటి, రెండేళ్లలో పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని కనుగొంటామన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top