తల్లిదండ్రుల చెంతకు నవ్యశ్రీ

తల్లిదండ్రుల చెంతకు నవ్యశ్రీ - Sakshi

  • కిడ్నాప్‌ కథ సుఖాంతం

  • సమాచారం ఇచ్చిన యాదయ్యకు అవార్డు అందజేస్తామన్న డీఎస్పీ

  • మహబూబ్‌నగర్‌ క్రైం: అపహరణకు గురైన బాలిక నవ్యశ్రీ మంగళవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. జనవరి 29న తిరుపతిలో ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్‌కు గురైన నవ్యశ్రీ సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలో దొరికిన విషయం విదితమే. మహబూబ్‌నగర్‌లో డీఎస్పీ భాస్కర్‌ కథనం ప్రకారం.. ఆనంతపురం జిల్లా తుమ్మచేర్ల గ్రామానికి చెందిన మహాత్మ, లక్ష్మిలు కూతురు నవ్యశ్రీతో కలసి తిరుపతి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో నిద్రించారు. అదే సమయంలో నవ్యశ్రీని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన బాలస్వామి అపహరించాడు.



    చిన్నారిని స్వగ్రామమైన అంతారం గ్రామానికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు పాప ఎక్కడిదని యాదయ్యను నిలదీశారు. దీంతో అతను బాలికను శ్రీశైలంలో వదిలిరావాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి మిడ్జిల్‌ మీదుగా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే తోటి ప్రయాణికుడు యాదయ్య పరిస్థితిని గమనించి నవ్యశ్రీ గురించి వివరాలు ఆరా తీశాడు. బాలస్వామి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు బాలస్వామిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నవ్యశ్రీని తిరుపతిలో అపహరించి తీసుకువచ్చానని ఒప్పుకున్నాడు. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో నవ్యశ్రీని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నవ్యశ్రీ ఆచూకీని తెలిపిన యాదయ్యకు డీజీ చేతుల మీదుగా రివార్డు ఇస్తామని డీఎస్పీ తెకలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top