ఐదేళ్లలో అందుబాటులోకి నవీముంబై విమానాశ్రయం


నాగపూర్: 2019 నాటికల్లా ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. విధానమండలిలో గురువారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెలాఖరులోగా ఈ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నింటినీ పొందుతామన్నారు. తొలివిడత కార్యకలాపాలు 2019లో ప్రారంభమవుతాయన్నారు. సంజయ్‌దత్తా, భాయ్ జగ్తాప్, హుస్నబాయి ఖాలిఫ్, శరద్ రణ్‌పిసే తదితర సభ్యులు సావధాన తీర్మానం కింద అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు.



‘ఈ విమానాశ్రయం కోసం ఇప్పటికే 592 ఎకరాల భూమిని సేకరించాం. వివిధ రకాల అనుమతుల మంజూరు కూడా చకచకా జరిగిపోతోంది. ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చే నెలాఖరులోగా వస్తాయి. అనుమతులన్నీ వచ్చాక నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తాం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 14,573 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సిడ్కో సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. తొలి దశ పూర్తయితే  ఏడాదికి దాదాపు 10 మిలియన్ల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయంలో సేవలు అందుబాటులోకి వస్తాయి. నిరుదోగ్యులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో దీనిని నిర్మిస్తాం. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపు అవుతుంది’ అని పేర్కొన్నారు.



‘విద్యాప్రమాణాల్ని మరింత పెంపొందించాలి’

నాగపూర్: రాష్ర్టవ్యాప్తంగా వివిధ సంస్థల్లో విద్యాప్రమాణాలు నానాటికీ క్షీణించిపోతుండడంపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు యోగేష్ సాగర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అన్నిరంగాల్లో రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే విద్యాప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.



ఇదే అంశంపై మరో సభ్యుడు గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ పాఠశాల విద్యకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా ప్రమాణాల మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకుగాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ అదే సమయంలో సభలో ఉన్న విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డేకి సూచించారు.



రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వైద్య విద్యా కళాశాలల పనితీరు ఎంతమాత్రం బాగాలేదన్నారు. 50 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు తగినంత డొనేషన్ ఇవ్వగలిగితే ఈ కళాశాలలు వారికి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తున్నాయని, ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి కళాశాలల్లో ప్రమాణాలు ఎలా ఉంటాయనే విషయానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి వైద్యవృత్తిని స్వీకరించినా వారు రోగులకు సరైన వైద్యసేవలను అందించలేరన్నారు. రోగులకు తగు పరీక్షలు కూడా చేయలేరన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top