కాంగ్రెస్ టికెట్ కోసం స్థానికేతరుల పోటీ


సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు స్థానికేతరరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెల 21న జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఆగస్టు 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. చిత్రదుర్గం మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు శశికుమార్, చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు మాజీ ఎమ్మెల్యే ఎన్‌వై. గోపాలకృష్ణ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరు స్థానికేతరులే.



బళ్లారి గ్రామీణ నియోజకవర్గ టికెట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని సీఎం సిద్దరామయ్య, కేసీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ల వద్ద తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌వై గోపాలకృష్ణ మొళకాళ్మూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈయన చిత్రదుర్గం మాజీ ఎంపీ, బళ్లారి నుంచి కాంగ్రెస్ తరుపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎన్‌వై. హనుమంతప్పకు స్వయానా సోదరుడు. ఎన్‌వై గోపాలకృష్ణతోపాటు సినీ నటుడు, మాజీ ఎంపీ శశికుమార్ కూడా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.



బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలో శ్రీరాములుకు బలమైన క్యాడర్ ఉందని, ఆయన వర్గీయులు ఎవరిని నిలబెట్టినా బీజేపీ సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉంది. అందువల్ల బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరుపున పోటీకి నిలబెట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

 ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వండ్రీ (వన్నూరప్ప) ఈసారి తనకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. వండ్రీతో పాటు మరో కాంగ్రెస్ నేత రాంప్రసాద్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.



బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత, బహిర్గతంగా విభేదాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఒక వర్గానికి టికెట్ కేటాయిస్తే మరొక వర్గం చెందిన నేతలు మద్ధతు ఇస్తారా? లేదా? అన్నది ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. అయితే లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలా? లేక నాన్‌లోకల్ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ హైక మాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top