కాంగ్రెస్ వల్లే కారుచీకట్లు


చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో రెండురోజులుగా పర్యటిస్తూ తమిళులు చూపుతున్న అభిమానంతో తడిసిముద్దయ్యానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పేర్కొన్నారు. మహామహులను దేశానికి అర్పించిన మహోన్నతమైన భూమిగా తమిళనాడును పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ గురువారం ఈరోడ్డు, రామనాధపురం, నాగర్‌కోవిల్‌లలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు చిన్నమలై జయంతి రోజున ఆయన జన్మించిన ఈరోడ్‌లో తాను ఉండటం అదృష్టమని అంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు శపథం చేశారని అన్నారు.

 

 ఈ ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాదు ప్రజలే పోటీచేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆశిస్తున్నట్లుగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఒక మహిళ దేశాన్ని అమ్మివేశారని పరోక్షంగా కనిమొళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యుత్ కరువై చీకట్లు కమ్ముకున్నాయంటే ఇందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్రం ఆధీనంలోని విద్యుత్ గ్రిడ్ ద్వారా రాష్ట్ర వాటాను అందివ్వడంలో కాంగ్రెస్ వివక్ష చూపిందని ఆయన అన్నారు. గుజరాత్ ప్రజలు విద్యుత్‌కోత అంటే ఎరుగరని, అక్కడి పిల్లలు తమిళనాడుకు వస్తే ఫ్యాన్ తిరగకుంటే ఆశ్చర్యపోతున్నారని అన్నారు.

 

 2012లో తమిళనాడులో 77 వేల మంది నిరుద్యోగులు ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదు చేసుకోగా కేవలం 10,800 మంది మాత్రమే  ఉద్యోగాలు పొందారని ఆయన విమర్శించారు. గుజరాత్‌లో ఇదే విధానంలో 57 శాతం మందికి ఉద్యోగాలు దక్కాయని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈరోడ్‌లోని పసుపు వైద్యం అమెరికాలో ప్రసిద్ధి చెందినదని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇక్కడి వైద్యానికి ఎగుమతులు వృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమిళ ప్రజలు, ముఖ్యంగా జాలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే తమిళనాడు మాత్రమే కాదు దేశ ముఖచిత్రమే మారిపోతుందని అన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top