స్వరూపాన్నే మార్చేద్దాం!


సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఈ కూటమికి మద్దతుగా రాష్ట్రంలో పర్యటించేందుకు మోడీ నిర్ణయించారు. చెన్నైలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. రజనీకాంత్‌ను కలుసుకుని స్నేహ పూర్వక అభినందనలను అందుకున్నారు. ఈ పరిస్థితుల్లో మలి విడతగా బుధవారం ఎన్నికల ప్రచారానికి మోడీ నిర్ణయించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన మోడీ రాష్ర్టంలో మూడు ప్రచార సభల్లో ప్రసంగించి ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేశారు. కృష్ణగిరిలో: మధ్యాహ్నం కృష్ణగిరి జిల్లాలో జరిగిన ప్రచార సభలో పీఎంకే అభ్యర్థులు అన్బుమణి రాందాసు, ఏకే మూర్తి, ఆర్ వేలు, జీకే మణి, ఎదిరొళి మణియన్, తదితరులను పరిచయం చేశారు. వనక్కం...అందరికీ విజయాలు చేకూరాలని కాంక్షిస్తూ, తమిళంలో ఆయన  కొన్ని వ్యాఖ్యలు చేసి తన ప్రసంగాన్ని సాగించారు. మోడీ హిందీ ప్రసంగాన్ని స్థానిక ముస్లిం మహిళ మునవర్ బేగం త మిళంలో అనువదించడం ప్రత్యేకతన సంతరించుకుంది.

 

 సేలంలో: కృష్ణగిరి పర్యటనను ముగించుకున్న మోడీ సేలంకు వచ్చారు. అక్కడి విద్యామందిర్ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌తో కలసి వేదిక మీదకు వచ్చిన మోడీ పదే పదే కెప్టెన్ అంటూ డీఎండీకే వర్గాల్లో ఉత్సాహాన్ని నింపే యత్నం చేశారు. రాష్ట్రంలో 14 చోట్ల ఎన్నికల బరిలో ఉన్న డీఎండీకే అభ్యర్థులను మోడీ ఓటర్లకు పరిచయం చేశారు. విజయకాంత్ సతీమణి ఎన్‌డీఏ కూటమిని సరికొత్తగా అభివర్ణించారు. నేషనల్ డెవలప్ అలయన్స్‌గా అభివర్ణిస్తూ ఆమె చేసిన ప్రసంగాన్ని మోడీ ఆహ్వానించారు. రాష్ట్రంలోని సమస్యలు, విద్యుత్ సంక్షోభం, జాలర్లపై దాడులను వివరిస్తూ విజయకాంత్ అందజేసిన వినతి పత్రాన్ని స్వీకరించారు. మోడీని తమిళ సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలతో విజయకాంత్ సత్కరించారు. ఇక్కడ  ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను ఆంగ్లంలో చకచకా మోడీ ప్రసంగించేశారు. కోయంబత్తూరు వెళ్లాల్సిన దృష్ట్యా, 15 నిమిషాల్లో సభను ముగించేయడం డీఎండీకే వర్గాల్లో కాస్త నిరుత్సాహాన్ని నింపినట్టు అయింది. మోడీ వెళ్లాక, విజయకాంత్ అండ్ బృందం కాసేపు ప్రసంగించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

 

 కోయంబత్తూరులో: సేలం పర్యటన ముగించుకున్న మోడీ హెలికాఫ్టర్‌లో కోయంబత్తూరు బయలు దేరి వెళ్లారు. అక్కడి కొడిస్సియా ఆవరణలో జరిగిన ప్రచార సభలో ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థులు పొన్ రాధాకృష్ణన్, సీబీ రాధాకృష్ణన్, ఏసీ షణ్ముగం, తదితర అభ్యర్థుల్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వర్గాలు ఆయనకు బ్రహ్మరథం పట్టారుు. అధికారం తథ్యం: కృష్ణగిరి, సేలం, కోయంబత్తూరు ప్రచార సభలో మోడీ ప్రసంగిస్తూ, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే, తమిళనాడు స్వరూపాన్ని మార్చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తమ కూటమికి చెందిన అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత తమిళనాడు ప్రజల మీద ఉందన్నారు. ఈ ఎన్నికలు పార్టీలు, అభ్యర్థుల కోసం కాదని, కోట్లాది ప్రజల సంక్షేమం కోసం, దేశ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ జరుగుతున్నాయని వివరించారు.

 

 తమిళనాడు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని గుర్తు చేస్తూ, ఇందుకు ప్రధాన కారకులు కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకేల ప్రభుత్వాలేనని ధ్వజమెత్తారు. గుజరాత్‌ను ఏ విధంగా అభివృద్ధి పరిచామో, విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామో, తాగు నీటి ఎద్దడి నుంచి ప్రజల్ని ఎలా బయట పడేశామో, అదే తరహాలో అభివృద్ధిని తమిళనాడులోను చేసి తీరుతామని స్పష్టం చేశారు. అడ్డుకట్ట : తమిళ జాలర్లపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసి తీరుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఆవిర్భవించిందని, ఈ కూటమి కొనసాగుతుందని, ఇది గెలుపు కూటమిగా అభివర్ణించారు. తమ కూటమి ప్రతినిధులను పార్లమెంట్‌కు అధిక సంఖ్యలో పంపించాలని, అప్పుడే ఇక్కడి సమస్యలన్నీ తమ దృష్టికి వస్తాయని, పరిష్కరించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను, దేశాన్ని సర్వనాశనం చేసిన యూపీఏను సాగనంపుదామని, సరికొత్త భారత్‌ను నిర్మించుకుందామని ఓటర్లకు పిలుపు నిచ్చారు.  

 

 మోడీతో విజయ్ భేటీనా: నరేంద్ర మోడీని సినీ నటుడు ఇళయ దళపతి విజయ్ భేటీ అయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కోయంబత్తూరులో ఈ భేటీ జరిగినట్టు సమాచారం. రజనీ కాంత్‌ను నరేంద్ర మోడీ కలిసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయ్ ఈ సారి తన మద్దతును బీజేపీకి ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. కోయంబత్తూరు సభ అనంతరం ఈ భేటీ ఉంటుందని సమాచారం.   తొలి రోజు మూడు ప్రచార సభల్లో ప్రసంగించిన మోడీ రాత్రి కోయంబత్తూరులో బస చేశారు. గురువారం రామనాధపురం, నాగర్‌కోయిల్, ఈరోడ్‌లలో పర్యటించనున్నారు. కాగా కోవైలో బుధవారం రాత్రి సినీ నటుడు విజయ్ మోడీని కలుసుకున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top