నేటి నుంచి నాగోబా జాతర

నేటి నుంచి నాగోబా జాతర - Sakshi

ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లాలోని కేస్లాపూర్‌ నాగోబా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి 10 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే నాగోబా మహాపూజలు ఘనంగా నిర్వహించడానికి మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. ఈనెల 27న ప్రారంభమయ్యే జాతర అధికారికంగా 31 వరకు కొనసాగుతుంది. మహాపూజలో భాగంగా పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి, ఏడు రకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. గంగాజలం కోసం 80 కిలోమీటర్ల దూరంలో జన్నారం మండలంలో ఉన్న గోదావరినదిలోని హస్తిన మడుగు నుంచి జలం తీసుకొని కాలినడకన ఈనెల 22న కేస్లాపూర్‌ మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు. 23 నుంచి అక్కడ వివిధ రకాల పూజలు నిర్వహిస్తుండగా.. ఆయా ప్రాంతాల్లోని మెస్రం వంశీయులు అక్కడికి చేరుకున్నారు.


 


రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు, గిరిజనులు జాతరకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలైన డోలు, పేప్రే, కాళికోమ్‌ వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. వివిధ పూజల అనంతరం గోదావరినది నుంచి తీసుకొచ్చిన జలంతో ఆలయాన్ని శుద్ధి చేసి, నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజలు నిర్వహిస్తారు. పూజల సమయంలో మెస్రం వంశీయులను తప్ప ఇతరులెవరినీ ఆలయంలోకి అనుమతించరు. పూజల తర్వాత అథితులైన జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మెస్రం వంశంలో ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మెస్రం కోడళ్లను వారి కుటుంబీకులు నాగోబా దర్శనం చేయించి, వంశ పెద్దలను పరిచయం చేయించి వారి ఆశీస్సులు పొందుతారు. దీనిని బేటింగ్‌ అంటారు. దీంతో నాగోబా జాతర ప్రారంభమైనట్లు మెస్రం వంశ పెద్దలు ప్రకటిస్తారు.


28న పెర్సపేన్‌ పూజలు పురుషులు మాత్రమే నిర్వహిస్తారు. 29న భాన్‌ దేవాతకు పూజలు చేస్తారు. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 30న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. 31న భేతల్‌ పూజలు, మండ గాజిలింగ్‌ పూజలు చేయడంతో అధికారికంగా జాతర ముగిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా మరో మూడు రోజుల వరకు జాతర రద్దీ కొనసాగుతుంది. నాగోబా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులను విడుదల చేయగా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.ఉట్నూర్‌ నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. 


 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top