60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన బిడ్డ..

60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన బిడ్డ.. - Sakshi


తన బిడ్డ మరో 60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన వాడని.. అంతలోనే పక్క రాష్ట్రంలో ఇంత అఘాయిత్యం జరిగిపోయిందని కోలార్‌లో హత్యకు గురైన పవన్ అభిమాని వినోద్ రాయల్ తల్లి అన్నారు. తమ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తన కొడుకు ఎప్పుడూ పదిమందికి సేవ చేయాలి, అనాథాశ్రమం పెట్టాలి, ఫ్యాక్టరీ పెట్టి 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేవాడని ఆమె తెలిపారు. ఆ రోజు కూడా కర్ణాటకలోని కోలార్‌లో అవయవదానం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశాడని అన్నారు. అదే అక్కడివాళ్లకు కంటగింపుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.



సాయంత్రం కారులో బయల్దేరుతున్నానని, చికెన్ చేయాలని తనకు ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే కారు ఎక్కుతున్న పిల్లాడిని ఆపి, మాట్లాడాలని పది అడుగుల దూరం తీసుకెళ్లారని ఆమె అన్నారు. అక్కడ అతడితో ఏమీ మాట్లాడలేదని, కళ్లలో దుమ్ముకొట్టి పొడిచి చంపేశారని విలపించారు. గుండె బయటకు వచ్చేసిందని చెబుతున్నారని.. తన బిడ్డ ఇంకెలా బతుకుతాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. పవన్ కల్యాణ్ తన కొడుక్కి న్యాయం చేస్తానన్నారని.. తనకు కొడుకులా ఉంటానన్నారని ఆమె చెప్పారు. బిడ్డ ఆత్మకు శాంతి కలిగిద్దామని.. అతడి ఆశయాలను నెరవేరుద్దామని చెప్పారన్నారు. తమ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.



ఇక కొడుకు లేని లోటు తీర్చలేనిదే అయినా.. తననే కొడుకులా అనుకోవాలంటూ పవన్ తమకు చెప్పారని వినోద్ రాయల్ తండ్రి చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను వదిలేశారని ఆయన ఆరోపించారు. త్రినాథ్, సునీల్ అనే ఇద్దరికీ బాగా డబ్బుందని అంటున్నారని, వాళ్లిద్దరినీ కూడా పట్టుకుని శిక్షించాలని పవన్‌ను తాను కోరానని తెలిపారు. తప్పకుండా వాళ్లకు కూడా శిక్ష పడేలా చూస్తానని ఆయన చెప్పారన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top