చిరుతపై ఎదురు దాడి!

చిరుతపై ఎదురు దాడి! - Sakshi


కన్న కొడుకును కాపాడుకున్న తల్లి

ముంబై: తన బిడ్డకు ఆపద ముంచుకొస్తుందని తెలిస్తే పిల్లి కూడా పులి అవతారమెత్తుతుంది. అలాంటిది నవమాసాలు మోసి కన్న కొడుకును ఓ పులి ఎత్తుకెళ్తుంటే ఏ తల్లి అయినా ఊరికే ఉంటుందా? అపర కాళిక అవతారమెత్తదా? ముంబైలోని సంజయ్‌గాంధీ నేషనల్‌ పార్క్‌ సమీపంలోగల ఆరే కాలనీకి చెందిన ఓ తల్లి కూడా అదే చేసింది. వివరాల్లోకెళ్తే... అటవీ ప్రాంతానికి దగ్గరలోగల ఛాఫా తాండాలలో నివాసముంటున్న ప్రమీలా రింజద్‌ ఏదో పనిమీద ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అయితే తన మూడేళ్ల కొడుకు ప్రణయ్‌ తన వెనకాలే వచ్చిన విషయాన్ని ఆమె గుర్తించలేదు.


బాలుడు ఒంటరిగా వస్తున్న విషయాన్ని గమనించిన ఓ చిరుత  పొదల్లో నుంచి బాలుడిపై దాడి చేసింది. దీంతో కొడుకు అరుపులు విన్న ప్రమీలా అటూ ఇటూ చూడడంతో పిల్లాడిని ఎత్తుకుపోతున్న చిరుత కనిపించింది. దీంతో ఒక్క ఉదుటన పులిమీదకు దూకింది. దాని చెర నుంచి బాలుడిని విడిపించుకోవడమే కాకుండా చిరుతనూ బలంగా దూరంగా నెట్టేసింది. ఆ తర్వాత కూడా చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించడంతో గట్టిగా అరుస్తూ చిరుతను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. దీంతో ఆ అరుపులకు చిరుత అక్కడి నుంచి పరారైంది. అంతలోనే అక్కడకు చేరుకున్న స్థానికులంతా చిరుత కోసం ఎంతగా వెతికినా అది కనిపించలేదు. చిన్నపాటి గాయాలైన పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు కుట్లు మాత్రమే వేసి ఇంటికి పంపించేశారని ప్రమీల చెప్పింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top