ఎమ్మెన్నెస్ ఓ కెరటం.. ఉవ్వెత్తున లేస్తుంది

ఎమ్మెన్నెస్ ఓ కెరటం.. ఉవ్వెత్తున లేస్తుంది - Sakshi


సాక్షి, ముంబై: ఎమ్మెన్నెస్ సముద్రపు కెరటమని, మళ్లీ ఉవ్వెత్తున పైకి లేస్తుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. గోరేగావ్‌లో శనివారం సాయంత్రం పార్టీ ఉపాధ్యక్షులు, గట్ ప్రముఖులు, పదాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, ప్రజలు ప్రశ్నించకపోతే ప్రధాని మరింత ఖరీదైన సూటు కుట్టించుకునేవారని మోదీపై రాజ్ విమర్శల బాణాలు సంధించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామ భారత పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ప్రత్యేకంగా తయారుచేసిన ఖరీదైన సూటు ధరించారని, తర్వాత దాన్ని గుజరాత్‌లో వేలం వేశారన్న విషయం తెలిసిందే.

 

దీనిపై రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి పదవిలో ఉన్నవారు అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలన్నారు. సూటును గుజరాత్‌లో వేలం వేసిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే మోడీకి సొంతరాష్ట్రంపైనే ప్రేమ ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. సూటు వేలానికి ఇలాంటి స్పందన వస్తుందని ముందే తెలిసుంటే మరిన్ని సూట్లు కుట్టించుకునేవారని ఎద్దేవా చేశారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును గంగానది శుభ్రపరచడానికి వినియోగిస్తానని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్ స్పందిస్తూ... గంగా నది ఎక్కడ...? మోడీ సూట్ ఎక్కడ...? ఇంత చిన్న సూట్‌తో అంతపెద్ద నదిని ఎలా శుభ్రపరుస్తారని ప్రశ్నించారు. చాయ్ (టీ) విక్రయించే వ్యక్తి ప్రధాని కావాలని లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించారని, ఇపుడు ఆయన వైఖరిపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించాలన్నారు.

 

టోల్‌పై నోరు మెదపరేం?

ఎన్నికలకు ముందు టోల్ రద్దు చేస్తామని వాగ్దానాలు చేసిన బీజేపీ, శివసేన నాయకులు అధికారంలోకి రాగానే ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. టోల్‌కు వ్యతిరేకంగా ఎమ్మెన్నెస్ మాత్రమే పోరాడుతోందని, ఇతర పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఎమ్మెన్నెస్ లక్ష్యంగా ఆరోపణలు చేసే అధికార పార్టీలు టోల్ ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెన్నెస్ ఆవిర్భవించలేదని, మహారాష్ట్ర హితవు కోసమని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో ఓటమి చెందినంత మాత్రాన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని నేతలకు, కార్యకర్తలకు హితవు పలికారు. శాసన సభలో ఎదురైన ఓటమిని మర్చిపోయి, ప్రజా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సముద్రపు అలల మాదిరిగా ఎమ్మెన్నెస్ మళ్లీ ఉవ్వెత్తున పైకి లేస్తుందన్న నమ్మకం ఉందని ఉద్ఘాటించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top