పార్టీ మారలేదే!

పార్టీ మారలేదే!


వేటుకు గురైన ఎమ్మెల్యేల వాదన

సీఎం, అసెంబ్లీ కార్యదర్శిలను వివరణ కోరిన మద్రాసు హైకోర్టు

న్యాయవాదులుగా మహామహులు రంగంలోకి

వేటుపై స్టేకు కోర్టు నిరాకరణ


‘మేమంతా అన్నాడీఎంకేలోనే ఉన్నామే, అసలు పార్టీ ఎక్కడ మారాం.




ఫిబ్రవరిలో సీఎం ఎడపాడి బలపరీక్ష సమయంలో మేం ఆయనకే ఓటు వేశాం, ఇప్పుడు కూడా అన్నాడీఎంకేలోనే ఉన్నాం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. ముఖ్యమంత్రి ఎడపాడిపై నమ్మకం లేదని మాత్రమే గవర్నర్‌కు లేఖలు అందజేశాం. అన్నాడీఎంకేకి వ్యతిరేకంగానో, మరో పార్టీకి అనుకూలంగానూ వ్యవహరించలేదు’’అంటూ ప్రశ్నిస్తున్నారు ఇటీవల అనర్హత వేటుకు గురైన 18 మంది ఎమ్మెల్యేలు. ఇదే వాదనను కోర్టుకు వినిపిస్తున్నారు.



సాక్షి ప్రతినిధి, చెన్నై : ఎడపాడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్లుగా దినకరన్‌ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తాత్కాలిగా గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుకు గతనెలలో లేఖలు అందజేశారు. ఈ చర్యతో ఎడపాడి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తదనంతర పరిణామాల తరువాత పార్టీ మారారని కారణం చూపి 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ వేటుపడిన వెంటనే వారు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ రెండోసారి బుధవారం విచారణకు వచ్చింది. పార్టీ మారకుండానే మారినట్లుగా ఆరోపిస్తూ స్పీకర్‌ జారీచేసిన అనర్హత వేటు ఆదేశాలపై స్టే మంజూరు చేయాలన్న ఆ ఎమ్మెల్యేల కోర్కెను కోర్టు నిరాకరించింది.



వ్యతిరేక చర్యలకు పాల్పడ లేదు

ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం ఎడపాడి బలపరీక్ష సమయంలో తాము ఆయనకే ఓటు వేశాం, ఇప్పుడు కూడా అన్నాడీఎంకేలోనే ఉన్నాం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు వాదించారు. సీఎం ఎడపాడిపై నమ్మకం లేదని మాత్రమే గవర్నర్‌కు లేఖలు అందజేశామని చెప్పారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానో, మరో పార్టీకి అనుకూలంగానూ వ్యవహరించలేదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ స్పీకర్‌ జారీచేసిన అనర్హత వేటు ఆదేశాలను, ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వారు కోర్టును కోరారు.



ఇదిలా ఉండగా, డీఎంకే ప్రవేశపెట్టదలుచుకున్న అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేక్కెందుకు పథకం ప్రకారం తమపై అనర్హత వేటువేశారని ఎమ్మెల్యే వెట్రివేల్‌ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అసెంబ్లీలో డీఎంకేను సైతం బలహీనపరిచేందుకు స్పీకర్‌ ధనపాల్‌ గుట్కాకేసును తెరపైకి తెచ్చారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను అసెంబ్లీ ప్రదర్శించారనే ఆరోపణలపై 21 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పంపారు. అంటే దినకరన్‌ వర్గ 18 మందితోపాటూ 21 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సైతం ఇంటికి పంపేందుకు ఎడపాడి ప్రభుత్వం కుట్రచేస్తున్నట్లుగా స్టాలిన్‌ అనుమానించి కోర్టులో పిటిషన్‌ వేశారు.



వరుసగా ఒకే తరహా పిటిషన్లు

అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధమైన నాటి నుంచి వరుసగా కోర్టుకు చేరుతున్న పిటిషన్లు ఒకే అంశానికి చెందినవిగా మారిపోయాయి. వీటిల్లో డీఎంకే వేసిన పిటిషన్‌ సైతం అన్నాడీఎంకే వివాదాలతో ముడివడి ఉండడం విచిత్రంగా మారింది. దాదాపుగా అన్నింటినీ అత్యవసర పిటిషన్లుగా మద్రాసు హైకోర్టు స్వీకరించింది. అయితే తీర్చు చెప్పేందుకు అన్ని అంశాలను పరిశీలించాల్సి రావడంతో అన్ని పిటిషన్లు బుధవారం ఒకే న్యాయమూర్తి ముందుకు వచ్చాయి.  ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గుట్కా ప్యాకెట్లు ప్రదర్శించినందుకు స్పీకర్‌ జారీచేసిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై డీఎంకే వేసిన పిటిషన్‌.. మొత్తం నాలుగు పిటిషన్లను న్యాయమూర్తి దురైస్వామి ఒకేసారి విచారించారు.



గుట్కా వ్యవహారంలో 21 మంది డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ నోటీసు విచారణ, తమిళనాడు ప్రభుత్వం బలపరీక్షకు గవర్నర్‌ ఉత్తర్వులు జారీచేసేలా ఆదేశించాలని డీఎంకే వేసిన పిటిషన్, 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్‌ నిలువరించాలని కోరుతూ ఎమ్మెల్యే వెట్రివేల్‌ కొన్నిరోజుల క్రితం దాఖలు చేసిన పిటిషన్, అనర్హత వేటుపై స్టే విధించాలని కోరుతూ 18 మంది ఎమ్మెల్యేలు ఈనెల 18వ తేదీన వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి ఒకేసారి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం న్యాయమూర్తి తన నిర్ణయాలను వెల్లడిస్తూ, అనర్హత వేటుపై స్టే విధించేందుకు నిరాకరించారు. అయితే ఆయా నియోజకవర్గాలను ఖాళీగా ప్రకటించి ఉపఎన్నికలు నిర్వహించేందుకు వీలులేదంటూ స్టే విధించారు. అనర్హత వేటుకు దారితీసిన పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎం, ప్రభుత్వ చీఫ్‌ విప్, అసెంబ్లీ కార్యదర్శులను దొరస్వామి ఆదేశించారు. కోర్టు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించరాదని ఆదేశాలు జారీచేస్తూ కేసు విచారణను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా వేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top