నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ


ఆదిలాబాద్‌ టౌన్‌ : కానిస్టేబుల్‌ తుది పరీక్షను ఈ నెల 23న పకడ్బందీగా నిర్వహిస్తామని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించబోమని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని, అభ్యర్థులు 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతీ అభ్యర్థికి బయోమెట్రిక్‌ విధానంలో ఫొటోలు, వేలిముద్రలు సేకరిస్తామని తెలిపారు.


ప్రతీ పరీక్ష కేంద్రంలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ అధికారుల ప్రతినిధులు, అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, నోడల్‌ అధికారులు, బయోమెట్రిక్‌ అధికారులు ఉంటారని తెలిపారు. ఆదిలాబాద్‌ బస్టాండ్‌ ఆవరణలో పోలీసు హెల్ప్‌లైన్‌ ఉంటుందని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. బాల్‌పెన్‌తో పరీక్ష రాయాలని, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణపై అధికారులకు సందేహాలుంటే ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ పోతారం శ్రీనివాస్‌ను సంప్రదించాలని సూచించారు. నోడల్‌ అధికారిగా ఏఎస్పీ పనసారెడ్డి, చీఫ్‌ నిర్వహణ అధికారిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.అశోక్‌ వ్యవహరిస్తారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు 15 మంది అబ్జర్వర్లు, 13 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 40 మంది పోలీసు బయోమెట్రిక్‌ ఇన్విజిలేటర్స్, 13 మంది పోలీసు అధికారులు, నోడల్‌ అధికారులు నియమించినట్లు తెలిపారు.



ప్రత్యేక గదిలో ప్రశ్నపత్రాలు భద్రం

కానిస్టేబుల్‌ రాత పరీక్ష ప్రశ్నపత్రాలను పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లోని ప్రత్యేక గదిలో సాయుధ పోలీసుల రక్షణ మధ్య భద్రపర్చారు. జేఎన్‌టీయూ ప్రధాన పరిశీలకుడు, ప్రొఫెసర్‌ పి.వసంత్‌కుమార్, స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ అశోక్, ఇతర జిల్లా కోఆర్డినేటర్‌ నోడల్‌ అధికారి టి.పనసారెడ్డిలతో కలిసి జిల్లా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తారని ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ టి.పనసారెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ బుర్హాన్‌ అలీ, రూరల్‌ సీఐ పోతారం శ్రీనివాస్, ఆర్‌ఐ బి.జెమ్స్, ఆర్‌ఎస్సై బి.పెద్దయ్య తదితరులు ఉన్నారు. కాగా, పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఎస్పీ తనిఖీ చేశారు.



పరీక్ష కేంద్రాలివే..

1. నలందా డిగ్రీ కళాశాల (మావల)

2. విద్యార్థి డిగ్రీ కళాశాల (రవింద్రనగర్‌)

3. గౌతమి డిగ్రీ కళాశాల (శాంతినగర్‌)

4. వాగ్దేవి డిగ్రీ కళాశాల (విద్యానగర్‌)

5. లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌ (శాంతినగర్‌)

6. సీబీఆర్‌ హైస్కూల్‌ (శాంతినగర్‌)

7. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల (కలెక్టర్‌ రోడ్‌)

8. సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌ (పాత హౌజింగ్‌ బోర్డు)

9. శ్రీ సరస్వతి శిశుమందిర్‌ హైస్కూల్‌ (పాత హౌజింగ్‌బోర్డు)

10. ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల (శాంతినగర్‌)

11. ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల (వినాయక్‌చౌక్‌)

12. కృష్ణవేణి డిగ్రీ కళాశాల (బస్టాండ్‌ దగ్గర)

13. ఆదిత్య జూనియర్‌ కళాశాల (విద్యానగర్‌)

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top