నర్సాపూర్‌ టు నరసాపురం...ఓ మైనర్‌ ప్రేమకథ

నర్సాపూర్‌ టు నరసాపురం...ఓ మైనర్‌ ప్రేమకథ


నరసాపురం : ఓ బాలిక ప్రేమకథ తెలంగాణలోని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో ప్రేమికుడు జైలులో మగ్గుతుండగా, పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టంలేక బాలిక పారిపోయి వచ్చి పాలకొల్లు మహిళా మండలిని ఆశ్రయించింది. దీంతో వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. వారి చొరవతో బాలిక ఉదంతం నరసాపురంలోని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి దృష్టికి వెళ్లింది. ఈ కేసులో బాలికకు, యువకుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి వెల్లడించారు.



అసలేం జరిగిందంటే..  

మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌కు చెందిన బాలిక(16) సంగారెడ్డిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సాకా సందీప్‌(22)తో ప్రేమలో పడింది. సందీప్‌ స్వస్థలం పాలకొల్లు. తల్లిదండ్రులు బాలచంద్రుడు, ఇందిర చాలాకాలం క్రితం మెదక్‌ వెళ్లిపోయారు. అక్కడ బాలచంద్రుడు ట్రాక్టర్‌ నడుపుకుని జీవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్, బాలికను తీసుకుని పాలకొల్లు వచ్చేశాడు. దీంతో సందీప్‌పై బాలిక తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. సందీప్‌ సంగారెడ్డి సబ్‌జైలులో 20 రోజులుగా రిమాండ్‌లో ఉన్నాడు.



ఈ నేపథ్యంలో బాలిక మైనర్‌ అయినా ఆమె తండ్రి  పెళ్లి చేయడానికి యత్నించడంతో, బాలిక మళ్లీ ఇంట్లోనుంచి పారిపోయి పాలకొల్లు శ్రీ లలితా మహిళా మండలిని ఆశ్రయించింది. వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. బుధవారం ఆమెను  నరసాపురంలోని సభ్యురాలు డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి వద్దకు తీసుకొచ్చారు. అలాగే సందీప్‌ తల్లిదండ్రులు బాలచంద్రుడు, ఇందిర కూడా వచ్చారు. తమ కుమారుడిపై అన్యాయంగా కిడ్నాప్, రేప్‌ కేసు పెట్టి జైల్లో పెట్టారని, న్యాయం చేయాలని రాజ్యలక్ష్మికి వినతిపత్రం ఇచ్చారు.



బాలిక మైనర్‌ కావడంతో, తల్లిదండ్రులు వచ్చే వరకూ బాలిక సంరక్షణను లలితా మహిళా మండలి సభ్యులు తీసుకున్నారు.  రాజ్యలక్ష్మి మాట్లాడుతూ న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని అటు సందీప్‌కు అన్యాయం జరక్కుండా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు నడింపల్లి అన్నపూర్ణ, కార్యదర్శి పసుపులేటి వెంకటలక్ష్మి, ఉఫాధక్షురాలు కుసుమ ఝాన్సీ, ఎం.విజయలక్ష్మి, పి.లక్ష్మీవిమల పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top