‘డుమ్మా’ కొట్టడంలో పంకజ ఫస్ట్

‘డుమ్మా’ కొట్టడంలో పంకజ ఫస్ట్


♦ కేబినెట్ సమావేశాలకు గైర్హాజరైన వారిలో ముందున్న మంత్రి

♦ 28 సమావేశాల్లో తొమ్మిదింటిలో గైర్హాజరు

♦ వెల్లడించిన సహ కార్యకర్త అనీల్ గల్గలీ

 

 ముంబై : రాష్ట్ర కేబినెట్ సమావేశాలకు గైర్హాజరైన వారిలో మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే  మొదటి స్థానంలో నిలిచారు. సమావేశాలకు ఎక్కువగా గైర్హాజరైన వారిలో పీడబ్ల్యూడీ మంత్రి ఏక్‌నాథ్ శిండే, ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్, ఆర్థిక మంత్రి సుధీర్ మునుగంటివార్, సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్‌కుమార్ బదోలే తదితరులు తరువాతి స్థానాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నీటిపారుదల మంత్రి బాబన్‌రావ్ లోనికర్ మాత్రమే అన్ని సమావేశాలకు హాజరయ్యారు. ఈ మేరకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గలీకి ప్రధాన కార్యదర్శి కార్యాలయం వివరాలు వెల్లడించింది.



రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించిన మొత్తం సమావేశాల వివరాలను ఆర్టీఐ ద్వారా గల్గలీ కోరారు. 2014, డిసెంబర్ 11 నుంచి 2015, జూన్ 23 వరకు మొత్తం 28 కేబినెట్ సమావేశాలు జరిగాయని గల్గలీకి ప్రజా సంబంధాల అధికారి ఎన్‌బీ ఖేడేకర్ వె ల్లడించారు. పూర్తి మంత్రిత్వ శాఖ ఏర్పడక ముందు ఎనిమిది సమావేశాలు జరిగాయి. మొత్తం 18 మంది మంత్రుల్లో సీఎం ఫడ్నవీస్, లోనికర్ మినహా మిగితావారు ఎదో ఒక సమావేశానికి గైర్హాజరయ్యారు.



28 సమావేశాల్లో పంకజ 9 సమావేశాలకు, ఏక్‌నాథ్ షిండే 7, దీపక్ సావంత్ 6, సుధీర్ మునుగంటివార్ 5, రాజ్‌కుమార్ బదోలే 5, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా 4, పర్యావరణ మంత్రి రాందాస్ కదమ్ 4, వినోద్ తావ్డే 3, రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే 3, విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్‌కులే 3 సమావేశాలకు హజరుకాలేదు. కాగా, మంత్రులు అనుపస్థితి (హాజరుకాకపోవడం) కాకుండా సీఎం చర్యలేమైనా తీసుకున్నారా అని గల్గలీ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని సీఎస్ కార్యాలయం పేర్కొంది. మంత్రులు సమావేశాలకు తరచూ గైర్హాజరైతే వారిని పదవి నుంచి తొలగించే నియమాలున్నాయా అని కూడా గల్గలీ ప్రశ్నించగా అలాంటి నిబంధనలేవీ లేవని సంబంధిత కార్యాలయం వెల్లడించింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top