సీసీ కెమెరాలే కీలకం

సీసీ కెమెరాలే కీలకం - Sakshi

శాంతిభద్రతలే ప్రధానం

పోలీసుల సంక్షేమమే లక్ష్యం

రాష్ట్ర హోం శాఖ మంత్రి  నాయిని నర్సింహారెడ్డి 

 

మెదక్‌ రూరల్‌: దొంగతనాలను, రౌడీయిజాన్ని, టెర్రరిజాన్ని కంట్రోల్‌ చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయని, ఒక్క సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లుతో సమానంగా పని చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మెదక్‌ మండలం అవుసులపల్లి గ్రామం వద్ద గల మెదక్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన రూ.10కోట్ల78 లక్షల వ్యయంతో 600 మంది పోలీస్‌ సిబ్బంది క్వార్టర్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ నిధుల నుంచి తమ తమ నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిపారు. 

 


ఇటీవల హైదరాబాద్‌లో సీసీ కెమెరాల ఆధారంగా కేవలం 24 గంటల్లోనే పోలీసులు చేధించిన పలు కేసుల గురించి వివరించారు. నేరాలను అదుపు చేయడానికి అధునాతన పద్ధతులతో హైదరాబాద్‌లో 22 అంతస్తులతో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా సీసీ కెమెరాల ఆధారంగా ప్రతీ పోలీస్‌స్టేషన్‌ నుంచి నిమిషాల వ్యవధిలో మొత్తం వివరాలతో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌కు సమాచారం వస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన కొత్త మండలాల్లో త్వరలో పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండున్నర సంవత్సరాలుగా నేరాలు అదుపులో ఉన్నాయన్నారు.


 


ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టాం..


గతంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని ప్రవేశపెట్టి.. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించామన్నారు. పోలీసులు డబ్బులు తీసుకుని చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పోలీస్‌స్టేషన్‌కు నెలనెలా నిర్వహణ కోసం ఖర్చులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏ క్లాస్‌ పోలీస్‌స్టేషన్‌కు రూ.75వేలు, బి క్లాస్‌ పోలీస్‌స్టేషన్‌కు రూ.50వేలు, సీ క్లాస్‌ పోలీస్‌ స్టేషన్‌కు రూ.25వేలు అందిస్తున్నట్లు తెలి పారు. సీఎం ప్రతి రంజాన్‌కు ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 


 


పోలీసుల సంక్షేమానికి రూ.350 కోట్లు..


పోలీసుల సంక్షేమానికి 350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఆసరా పింఛన్‌ను, ఆరు కిలోల బియ్యం, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లా నీళ్లు, మిషన్‌ కాకాతీయ ద్వారా చెరువుల పురుద్ధరణ వంటి కార్యక్రమాలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పది వేల మంది పోలీసులు శిక్షణలో ఉన్నారని, అం దులో మహిళా పోలీసులు ఉన్నట్లు తెలిపారు. 


 


శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ వ్యవస్థ ఎంతో అవసరం..


శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ వ్యవస్థ ఎంతో అవసరమని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో రామాయంపేట పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వచ్చినప్పుడు మెదక్‌లో పోలీస్‌ సిబ్బంది కోసం క్వార్టర్లు, డీఎస్పీ కార్యాలయం కావాలని కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే పోలీస్‌ వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో అత్యధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్లారెడ్డి, డీఐజీ అకున్‌ సబర్వాల్, ఐపీఎస్‌ అధికారి నాగిరెడ్డి, ఎస్పీ చందనదీప్తి, మెదక్‌ ఎంపీపీ లక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యారెడ్డి, సర్పంచ్‌ పద్మ తదితరులు పాల్గొన్నారు.


 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top