సర్వేల పేరుతో రూ.100 కోట్లు లూటీ

సర్వేల పేరుతో రూ.100 కోట్లు లూటీ - Sakshi


కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు ఆరోపణ



అనంతగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల సర్వే పేరిట రూ.100 కోట్లు లూటీ చేశారని భారీనీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. మీ పాలనలో 34 ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఒక్కటైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వికారాబాద్‌ జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగునా సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. తమ హయాంలో చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో.. సోమవారం నిర్వహించనున్న పరిగి సభలో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.    ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పనుల కోసం కేవలం రూ.15 కోట్ల పనులు మాత్రమే చేపట్టిందని విమర్శించారు.



ఈ ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరు అందదని అప్పటి జిల్లా మంత్రులుగా ఉన్నవారు మౌఖికంగా చెప్పడంతోనే పనులు మధ్యలో ఆపేసినట్లు చెప్పారు. ఈపీసీ పద్ధతితో ప్రాజెక్టుల డబ్బులు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హరీశ్‌ స్పష్టం చేశారు. ఆయన వెంట మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బి.సంజీవరావు తదితరులు ఉన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top