కోట్లుంటేనే తెల్లకోటు!

కోట్లుంటేనే తెల్లకోటు! - Sakshi


చుక్కల్లో ఎంబీబీఎస్ ఫీజులు

‘డీమ్డ్’తో వసూళ్ల దారిచూపిన చంద్రబాబు

దక్షిణాది రాష్ట్రాలకు ఆయనే మార్గదర్శి

ఫీజుల అగ్నికి  ‘నీట్’ తోడయింది

కౌన్సెలింగ్‌కే రూ. లక్షల్లో

యాజమాన్యాలకు కలసి వచ్చిన కటాఫ్ మార్కులు

బ్రోకర్ల చేతిలోనే బీ కేటగిరీ సీట్లు..


 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వైద్యవిద్య అందని ద్రాక్షలా మారిపోయింది. ఎంబీబీఎస్ సీట్లు సంతలో సరుకు మాదిరిగా తయారయ్యాయి. సొమ్ములున్న మారాజులకే తప్ప సామాన్యులకు అవి దొరకడం లేదు. ప్రతిభతో పనేలేదు. వైద్య కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణకు వీల్లేకుండా వాటికవే ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేసుకునే విధానాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బాటలు పరిచారు.

 

లాభసాటిగా కనిపిస్తుండడంతో ఆయన చూపిన మార్గాన్ని మన రాష్ర్టమే కాదు పొరుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆనందంగా అనుసరిస్తున్నాయి. 2014లో అధికార పగ్గాలు చేపట్టగానే తన బంధువు లబ్ధి కోసం విశాఖలోని గీతం మెడికల్ కాలేజీకి డీమ్డ్ హోదా కల్పించిన చంద్రబాబు ఇష్టానుసారం ఫీజుల వసూళ్లకు తలుపులు బార్లా తెరిపించారు. ‘నీట్’ నేపథ్యంలోనూ కళాశాలలు ఫీజులను ఇష్టానుసారం పెంచేశాయి. దీంతో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగా మారింది.

 

 కోట్లు పెట్టుబడి పెడితేనే...

 ఇవాళ సంచుల్లో సొమ్ము నింపుకుని వెళితేనే మెడికల్ సీటు దొరుకుతుంది. విశ్వవిద్యాలయాల్లో డాక్టర్ చదువు పూర్తిచేయాలంటే హీనపక్షంలో 4 నుంచి 5 కోట్ల రూపాయలు తప్పనిసరి. ఆపై సొంతంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీసు ప్రారంభించాలంటే స్థాయిని బట్టి మరో రూ.2 కోట్లు ఆపైనే. వెరసి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితేనే డాక్టర్‌గిరీ. ఈ పరిస్థితికి కారకులెవరు?  వైద్యవిద్యను పర్యవేక్షిస్తున్న భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)దా? కళాశాలలు ఇష్టానుసారం ఫీజుల వసూలుకు అవకాశమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలదా? ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినా ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోని ఉన్నత న్యాయస్థానాలదా? అధికారంలోకి రాగానే చంద్రబాబు మెడికల్ కాలేజీలకు ఫీజులు పెంచుకునేందుకు అవకాశం  కల్పించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రూ.9 లక్షలకు మించి వసూలు చేయడానికి వీల్లేదన్నారు. అన్ని చోట్లా ఫీజులు పెరగడంతో చివరకు ఈ ఏడాది నుంచి బి కేటగిరి సీటుకు రూ.11.5 లక్షలకు తెలంగాణ కూడా అంగీకరించింది. మొత్తం మీద దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలల్లో బి కేటగిరి సీట్ల ధర అమాంతం పెరగడానికి ఆంధ్రప్రదేశ్ కారణమన్న విషయం అన్నిరాష్ట్రాల్లో వినిపిస్తోంది.  

 

 ఏపీని చూపి ఫీజులు పెంచిన కర్ణాటక

 ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కిందటే ఏడాదికి రూ.11 లక్షలుగా పెంచిన బి కేటగిరి ఫీజు బూచిని చూపి కర్ణాటకలోని పలు ప్రముఖ వైద్య కళాశాలలు 3 -5 లక్షలుగా ఉన్న ధరలను ఏకంగా  6-9 లక్షలుగా  పెంచి వసూలు చేస్తున్నాయి. జేజేఎం(దావణగిరి), జేఎస్‌ఎస్ (మైసూర్) బెల్గాం తదితర కళాశాలలకు 2,200 పడకల అనుబంధ ఆసుపత్రులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని కేజీహెచ్(విశాఖ), గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల లాంటి వాటికి మాత్రమే 1,000 చొప్పున పడకల ఆసుపత్రులు ఉన్నాయి. తక్కినవన్నీ 400 పడకలకు తక్కువగా ఉండటం గమనార్హం.

 

 కౌన్సెలింగ్‌లో తిరకాసులు

 ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లోని పలు డీమ్డ్ యూనివర్శిటీలు ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాయి. మణిపాల్, బెల్గాం ఈ నెల 9, 10, 11 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా, 13, 14, 15 తేదీల్లో ‘కోమెట్కే’ కౌన్సెలింగ్ జరిగింది. తెలంగాణలో అదే సమయంలో మూడోసారి ప్రవేశ పరీక్ష జరిగింది. వి ద్యార్థులు విమానాల్లో ప్రయాణించి పరీక్షకు, కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి వచ్చింది. మొత్తంమీద ఒక్కో విద్యార్థి వివిధ కళాశాలల ప్రవేశ పరీక్షలు రాయడానికి, కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చయ్యింది. 4, 5 కళాశాలలకు దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఇది. అంతకన్నా ఎక్కువ కళాశాలలకు దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే ఖర్చు రెట్టింపు అయ్యింది.

 

 బ్లాక్ టికెట్ల మాదిరిగా ధరలు..

 ఆగస్టు నెలాఖరు వరకు ఆయా కళాశాల వివరాల్లో బి కేట గిరి ఫీజుల ధరలు కనిపించగా ఆ తరువాత అవి అదృశ్యమయ్యాయి. అప్పటి నుంచి కళాశాలల తరఫున దళారీలుగా వ్యవహరించే వారి  ఫోన్‌నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉంచి ఫీజుల వివరాలు తెలియజెప్పడం ఆరంభించాయి. బ్లాక్‌లో సినిమా టిక్కెట్ల ధరల తరహాలో వైద్య కళాశాల బి కేటగిరి సీటు ధరలు పెంచుతూ చెపుతుండటం గమనార్హం. జాతీయస్థాయిలో మూడో ర్యాంకులో ఉన్న మణిపాల్ వైద్య కళాశాలలో బి కేటగిరి సీటు నాలుగన్నరేళ్లకు ధర రూ.42 లక్షలు. అదే ఆంధ్రప్రదేశ్‌లో కనీస గుర్తింపు, వైద్య సేవలు అందించలేని కళాశాలలు కూడా అయిదేళ్లకు గాను రూ.57.50 లక్షలు వసూలు చేస్తున్నాయి. వ్యత్యాసం రూ.15.50 లక్షలు.

 

 కౌన్సెలింగ్‌లకే లక్షల్లో ఖర్చా?

 విజయవాడకు చెందిన ఓ మధ్య తరగతి తండ్రి తన కుమార్తె మెడికల్ సీటుకోసం పడినపాట్లు చూస్తే మనం నోరెళ్లబెట్టాల్సిందే. ఆంధ్రలోని ఫీజుల ధరలను అందుకోలేని ఆయన కర్ణాటక వెళ్లారు. ఆగస్టులో ఆయా కళాశాలల ఫీజులను పరిశీలించిన ఆయన కర్ణాటకకు వెళ్లిన తరువాత ఫీజుల ధరలు పెరగడంపై విస్తుపోయారు.  ‘మా ఫీజులు ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తక్కువే.. మీ కళాశాలల్లోని వనరులు, వసతులతో పోల్చి చూసుకోండి’ అని ఆ కళాశాలల యాజ మాన్యాలు చెప్పాయట.

 

 దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మణిపాల్, బెల్గాం, బెంగుళూరు, కోలార్ వైద్య కళాశాలల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు ఆయన కుమార్తెతో హాజరయ్యారు. ‘కోమెట్కే’ కౌన్సెలింగ్ నుంచి తెలంగాణలో మూ డోసారి నిర్వహించిన ఎంసెట్‌కు హాజరు కావడానికి బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజులు మొదలు రవాణా, నివాస, కళాశాలలో ప్రవేశం వరకు తండ్రీకూతుళ్లు తిరగడానికి రూ.రెండు లక్షలకు పైగా ఖర్చయ్యింది.

 

 ఎంసీఐ నిర్వహణ లోపాలు...

 ఏఐపిఎంటీ ... సైనిక్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి గాను ఏఐపిఎంటీ పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ప్రభుత్వ, డీమ్డ్, ప్రయివేటు కళాశాలల్లో ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించాలని సుప్రీం ఆదేశించడంతో ఏఐపిఎంటీ పరీక్షను కూడా ఈ జాబితాలోకి తీసుకొచ్చారు. దీంతో ఏఐపిఎంటీ పరీక్షను నీట్-1గాను ఆ పరీక్ష రాయని విద్యార్థులకు నీట్-2గా నిర్వహించారు. జాతీయస్థాయిలో జరిగే అన్ని ప్రవేశ పరీక్షలకు పర్సంటైల్ (శాతం) తీయడం ఆనవాయితీ. టాప్ మార్కు, కటాఫ్ మార్కుల ఆధారంగా పర్సంటైల్ తీసుకుంటారు. నీట్-1, నీట్-2 రెండూ కలిపి తీయడంతో రెండో సారి పరీక్ష రాసిన విద్యార్థులు నష్టపోయారు.

 

 కటాఫ్ మార్కులతో కొట్టిన ఎంసీఐ

 కటాఫ్ మార్కుల విషయంలో ప్రయివేటు యాజమాన్యాల ఒత్తిడికి ఎంసీఐ తలొగ్గింది. సీటు ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. నీట్ 720 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మెడికల్ ఎంట్రెన్స్‌లో సాధారణంగా 40 శాతం మార్కులను అర్హత కింద పరిగణించేది. అయితే 720 మార్కులకు గాను 145 మార్కులకు అర్హత మార్కులుగా నిర్ణయించారు. అంటే 100కు సుమారు 20.13 శాతం వస్తే చాలన్నమాట. సాధారణంగా ఏ పరీక్షకు అయినా 35 మార్కులు సాధించిన వారినే ఉత్తీర్ణులుగా నిర్ణయిస్తారు.

 

 కానీ నీట్ ఆ విషయాన్ని పక్కన పెట్టింది. సాంకేతిక విద్యను ఇంత తక్కువగా చూడటం ఏంటనేది ప్రశ్న.  దీన్నిబట్టి అర్హత సాధించిన వారి సంఖ్య భారీగా పెరిగింది.  సీట్ల సంఖ్య వేలల్లో, అర్హుల సంఖ్య లక్షల్లో ఉండటంతో డబ్బున్న వారికే మెడికల్ సీటు దక్కించుకోవడం సాధ్యమైంది. ఇక్కడ ప్రతిభ కన్నా డబ్బే కీలకపాత్ర పోషించింది. కనీస అర్హత మార్కులను ఈ విధంగా తగ్గించడం వెనుక మతలబు ఏంటి?  కేంద్ర ప్రభుత్వం అనుమతించిందా? అసలు సుప్రీం కోర్టు దృష్టికి ఈ అంశం వెళ్లిందా లేదా? అనేది వేల డాలర్ల ప్రశ్న.

 

 డీమ్డ్ వద్దన్న అధికారిపై బాబు వేటు

 రాష్ట్రంలో 2014 ముందు వరకు ఏ మెడికల్ కళాశాలకు కూడా డీమ్డ్ హోదా లేదు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక విశాఖలోని ‘గీతం’ వైద్య కళాశాల డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకుంది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం తీవ్రంగా వ్యతిరేకించారు. డీమ్డ్ హోదా ఇస్తే మెడికల్ కౌన్సెలింగ్‌లో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కన్వీనర్ కోటా (50 శాతం) దక్కవనే ఉద్ధేశంతో  ఆయన తిరస్కరించారు. దీనిపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు ఏకంగా ఆయన్ను మార్చేసి పూనం మాలకొండయ్యను నియమించగానే ఆగమేఘాలపై ‘గీతం’కు  డీమ్డ్ హోదా దక్కింది.  

 

 దాంతో పాటు రాష్ట్రంలో తొలిసారిగా గీతం నర్సింగ్ కళాశాలకు డీమ్డ్ హోదా దక్కింది.  ఆ వెంటనే  మంత్రి   నారాయణకు చెందిన మెడికల్ కళాశాల నుంచి డీమ్డ్ హోదాకు దరఖాస్తు అందింది. మరో ఆరు వైద్య కళాశాలలు కూడా డీమ్డ్ హోదాను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇది ఆనవాయితీగా మారితే కన్వీనర్ కోటాలో దక్కాల్సిన వందలాది ఎంబీబీఎస్ సీట్లు చేజారతాయి. ఉన్నతాధికారి ఎల్వీ సుబ్రమణ్యం ఏదైతే పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారో చంద్రబాబు పుణ్యమా అని అదే జరుగుతోంది. వైద్యవిద్య కోటీశ్వరులకే పరిమితమన్న చందంగా పరిస్థితి మారుతోంది.

 

 వై.ఎస్.హయాంలో...

 దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కళాశాల సీట్లలో యాభై శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యేవి. తక్కిన పది శాతం సీట్లు బి కేటగిరి కింద ప్రభుత్వమే భర్తీ చేసేది. మిగిలిన 40 శాతం సీట్లలో 25 శాతం యాజమాన్య కోటా. 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాగా ఉండేది.

 ►   ఎ కేటగిరి కన్వీనర్ కోటా ... రూ.60 వేలు. (అర్హులైన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద తిరిగి వచ్చేది)

►   బి కేటగిరి ఫీజు రూ.2.40 లక్షలు. (ఈ కేటగిరిలోని అర్హులైన వారికి కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్ దక్కేది. ఒకవేళ  ఈ ఫీజు వర్తించని వారు కూడా అయిదేళ్లలో రూ.12 లక్షలకు ఎంబీబీఎస్ పూర్తయ్యేది)

►  సి కేటగిరి (యాజమాన్య కోటా) రూ.5.50 లక్షలు, ఎన్.ఆర్.ఐ కోటా ఏడాదికి రూ.27.50 లక్షలకు మించకూడదు.

 ఆదిలాబాద్, శ్రీకాకుళం, ప్రకాశం, కడప జిల్లాల్లో ఏక కాలంలో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)లు ఏర్పాటు చేశారు. 2007లో ఒక్కో కళాశాలలో 100 మెడికల్ సీట్ల చొప్పున ఏకకాలంలో 400 సీట్లను అందుబాటులోకి తెచ్చి వైఎస్ చరిత్ర సృష్టించారు. అప్పట్లోనే రూ.1,200 కోట్లను వెచ్చించారు. అవే కళాశాలలకు ఇప్పుడు పీజీ వైద్య సీట్లు కూడా వచ్చాయి.

 

 వైఎస్ హయాంలో

 ఎంబీబీఎస్ ఫీజుల వివరాలు (ఏడాదికి)

 కేటగిరీ    సీట్ల శాతం    ఫీజు

 కన్వీనర్ (ఎకేటగిరీ)    50    రూ.60వేలు

 బి కేటగిరీ    10    రూ.2.40 లక్షలు

 యాజమాన్యకోటా    25    రూ.5.50 లక్షలు

 ఎన్‌ఆర్‌ఐ కోటా    15    రూ.27.50 లక్షలు మించకుండా

 

 చంద్రబాబు సీఎం అయ్యాక


 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గీతంకు డీమ్డ్ హోదా ఇవ్వడంతో ఎంబీబీఎస్ ఫీజులు అమాంతం పెరిగాయి. అంతేకాదు బి కేటగిరి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు. పది శాతం సీట్లను కూడా యాజమాన్య కోటాకు కలిపేశారు.

 (ఉదాహరణకు... ఒక కాలేజీలో వంద సీట్లు ఉన్నాయనుకుంటే... కన్వీనర్ కోటా 50 సీట్లు, బి కేటగిరి-10 సీట్లు, యాజమాన్య కోటా 25, ఎన్‌ఆర్‌ఐ కోటా 15 ఉండేవి. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఇదే పద్ధతి కొనసాగేది.)

 బి కేటగిరి కింద ఉన్న పది సీట్లను యాజమాన్యం అమ్ముకునేందుకు అవకాశం కల్పించినందున... ఏడాదికి రూ.11.50 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకు రూ.57.50 లక్షలు అవుతుంది. పది సీట్లను అమ్ముకుంటే రూ.5.75 కోట్లు కళాశాలకు వస్తుంది. వై.ఎస్. హయాంలో పేద విద్యార్థులకు ఈ సీట్లు దక్కేవి. అధికారంలోకి రాగానే జిలాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం విజయనగరం, పశ్చిమగోదావరిజిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల లు లేవు. అధికారులు రెండుసార్లు ప్రతిపాదనలు ఇచ్చినా చంద్రబాబు నిర్ధ్వందంగా తోసిపుచ్చారు. అంతటితో ఊరుకోకుండా చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు.

 

 చంద్రబాబు హయాంలో ఎంబీబీఎస్ ఫీజుల వివరాలు (ఏడాదికి)

 కన్వీనర్ (ఎ కేటగిరీ)    50    రూ.10 వేలు

 బి కేటగిరీ (యాజమాన్య)    35    రూ.11.50 లక్షలు

 సి కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ)    15    రూ.57.50 లక్షలు మించకుండా

 (గతంలో పేదలకు రూ.2.40 లక్షలకే దక్కే ఎంబీబీఎస్ సీట్లను యాజమాన్యకోటాకు అప్పజెప్పారు)

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top