ఎమ్మెన్నెస్.. నా‘రాజ్’..!

ఎమ్మెన్నెస్.. నా‘రాజ్’..! - Sakshi


219 స్థానాల్లో పోటీ..ఒక సీటుతో సరి

రాజ్‌ను నమ్మని ప్రజలు

పట్టున్న జిల్లాల్లోనూ ఘోర పరాజయం


 

సాక్షి, ముంబై : మహారాష్ర్ట నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్)ను మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ‘నా చేతికి అధికారమివ్వండి... అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా.. ఒకవేళ నేను పనిచేయకుంటే రాజకీయ దుకాణాన్ని మూసివేస్తాన’ని ప్రకటించడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మార్చివేస్తానంటూ ప్రచారంలో హోరెత్తించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పూర్తిగా చతకిలపడిపోయారు. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 219 నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు.



ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి గెలవడం గమనార్హం. శివసేన నుంచి బయటపడిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్ స్థాపించారు. ఆ తర్వాత 2009లో మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఎమ్మెన్నెస్ 143 చోట్ల తమ అభ్యర్థులను బరిలో దింపి 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకుంది. 50 పైగా స్థానాల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.



అప్పట్లో రాజ్‌ను అన్ని పార్టీలు ప్రశంసించాయి. కాని ఈసారి 219 స్థానాల్లో పోటీచేసి కేవలం ఒకే సీటుతో సరిపెట్టుకోవల్సిన దుస్థితి వచ్చింది. ప్రచార సభల్లో రాజ్ చేసిన హామీలను బట్టి గత ఎన్నికలతో పోలీస్తే ఈసారి కనీసం 20-25 స్థానాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనవేశారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీకీ 120-125 సీట్లు వస్తాయని వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటులో ఎమ్మెన్నెస్ కీలకపాత్ర పోషిస్తుండవచ్చని భావించారు. కాని తాజా పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.



నగర రాజకీయాల్లో దిగ్గజాలుగా పేరుపొందిన ప్రవీణ్ దరేకర్, నితిన్ సర్‌దేశాయి, బాలా నాంద్‌గావ్కర్, శిశిర్ షిండే, మంగేశ్ సాంగ్లే లాంటి ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలను శివసేన అభ్యర్థులు మట్టికరిపించారు. ఎమ్మెన్నెస్‌కు మంచి పట్టున్న నాసిక్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ కార్పొరేషన్‌లో ఎమ్మెన్నెస్ అధికారంలో ఉంది. అయినప్పటికీ 15 స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థుల డిపాజిట్ కూడా గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ముంబైలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అదేవిధంగా బీఎంసీ ఎన్నికల్లో ఐదుగురిని బరిలో దింపినప్పటికీ ఒక్కరు కూడా గెలవలేకపోయారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top