ఇదేనా పాలన?

ఇదేనా పాలన? - Sakshi


సాక్షి, చెన్నై : రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయి ఉన్నదని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వానికే దక్కిందని మండి పడ్డారు. ఇదేనా ప్రజలకు అందిస్తున్న సుపరి పాలన అని ప్రశ్నించారు. ఆదివారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2011 ఎన్నికల ముందు రాష్ట్రంలో కేవలం 95కోట్ల అప్పుల్లో ఉండేదని గుర్తుచేశారు. అయితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అప్పులు భారీగా పెరిగాయని వివరించారు. తాము అధికారంలోకి వస్తే అప్పు రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని జయలలిత గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారని పేర్కొన్నారు.

 

 అయితే, ఇప్పుడు వెలుగు చూస్తున్న లెక్కల మేరకు రాష్ట్రంలో రెండు లక్షల 11 వేల 483 కోట్ల మేరకు అప్పుల్లో ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. ప్రత్యేక పథకాల ద్వారా రానున్న ఐదేళ్లల్లో లక్షా 20 వేల కోట్ల ఆదాయన్ని ఆర్జించి తీరుతామని ప్రగల్బాలు పలికిన సీఎం జయలలిత, ఇప్పుడు పేరుకు పోయిన అప్పుల గురించి ఎలాంటి సమాధానం ఇస్తారో అని  ఎద్దేవాచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన రూ. 28 వేల మేరకు అప్పును ప్రభుత్వం రుద్ది ఉన్నదని పేర్కొన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం వెనుక బడి ఉన్నా, అప్పుల్లో మాత్రం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ఉండడం విచారకరంగా పేర్కొన్నారు.

 

 ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయేందుకు ప్రధాన కారణం అధ్వానమైన పాలన, అవినీతి మయం అని ఆరోపించారు. పేరుకు పోయిన అప్పుల గురించి ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15 ఆర్థిక పరిశీలన నివేదిక మేరకు లక్షా 91 వేల 300 కోట్లను అప్పుగా చూపించి ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు. సుపరి పాలన అంటూ ప్రజల్ని అప్పుల్లోకి నెట్టడమేనా పాలన అని సీఎం జయలలితను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పులతో రాష్ట్రానికి తలవంపు తీసుకొచ్చి పెట్టిన ఈ పాలకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top