భూసేకరణపై రైతుల్లో అవగాహనకు శివసేన పర్యటన


ముంబై: భూసేకరణ బిల్లుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని శివసేన కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కోరారు. బుధవారం  పార్టీ సీనియర్ నేతలు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కార్యకర్తలతో ఠాక్రే సమావేశమయ్యారు. రైతులు భూసేకరణ బిల్లు పట్ల ఆందోళన చెందుతున్నారని వారికి ఈ విషయమై అవగాహన కల్పించాలన్నారు. బీజేపీకి ఓటేసిన రైతులను ప్రభుత్వం హింసించడం తగదని ఠాక్రే అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.  



చట్టంపై ప్రభుత్వం పునరాలోచించి, ప్రత్యామ్నాయాలు కనుగొనాలని సూచించారు. శివసేన ఎల్లప్పుడూ రైతుల పక్షమే అని ఠాక్రే పునరుద్ఘాటించారు. రైతులకు అన్యాయం చేసే ఏ చట్టానికి తాము మద్దతిచ్చేదిలేదని తేల్చి చెప్పారు. సేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రైతుల, పేదలకు వ్యతిరేకమైన ఈ బిల్లును వ్యతిరేకించాలన్నారు. బిల్లుకు పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. కాగా, బిల్లును పార్లమెంటులోని అన్ని ప్రతిపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలలో కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top