పోలవరం ప్రాజెక్టుపై కుట్ర

పోలవరం ప్రాజెక్టుపై కుట్ర - Sakshi


కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అనుమానం

కమీషన్ల కోసం ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకం చేయొద్దు


 సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌పై ఏదో కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం, జేబులు నింపుకోడానికే తానే పోలవరం ప్రాజెక్టును చేపడుతున్నారన్నారు. కేవీవీ బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పోలవరాన్ని కేంద్రం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రాజెక్ట్‌ను ఆపడానికి కుట్ర జరుగుతోందా? అనే భయాందోళనలు మొదలయ్యాయని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖా మంత్రి ఉమా భారతికి లేఖ రాసినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు.  కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ ఉనికిని ప్రశ్నార్థకం చేయొద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవరేఖ లాంటి ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, 2018కల్లా పూర్తిచేయాలని కేవీపీ కోరారు.


 వారిద్దరూ భట్రాజులుగా పనికొస్తారు

కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం చంద్రబాబు పుష్కరాలను వాడుకున్నారని కేవీపీ మండిపడ్డారు.ఈ సందర్భంగా బాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు పరస్పరం పొగుడుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. వారు భట్రాజులుగా కూడా పనికొస్తారని అర్థమవుతోందన్నారు. దివంగత  వైఎస్  వల్ల పూర్తయిన పోలవరం కాల్వల ద్వారా పట్టిసీమకు నీళ్లు అందించడం మినహా రాష్ట్రానికి ఇంకేమైనా ప్రాజెక్ట్‌ను తెచ్చారా? అని నిలదీశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top