తాళి బొట్టు ఉంచుకోవాలా...? తీసి వేయాలా..?

తాళి బొట్టు ఉంచుకోవాలా...? తీసి వేయాలా..? - Sakshi


సాక్షి, చెన్నై: ‘ తాళి బొట్టు ఉంచుకోవాలా...? తీసి వేయాలా..? అన్నది  వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భు వ్యాఖ్యానించారు. శివ సేన, హిందూ సంఘాల చర్యల్ని పరోక్షంగా ఆమె ఖండించారు. ఆమెకు మద్దతుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం వ్యాఖ్యలు చేశారు. ఇక, పెరియార్ దిడల్‌పై బాంబు దాడులకు సిద్ధమైన 20 మంది శివ సేన నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.



 ద్రవిడ కళగం నేతృత్వంలో మంగళవారం తాళి బొట్టు తొలగించే కార్యక్రమం నగరంలో జరిగిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు తీవ్రంగానే స్పందించాయి. సంప్రదాయాలను మంట గలుపుతున్నారంటూ ద్రవిడ కళగం నేతలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు తాము అనుకున్నది విజయవంతంగా ద్రవిడ కళగం నేతలు పూర్తి చేశారు. అయితే, తమ మనో భావాల్ని కించ పరిచే విధంగా వ్యవహరించారంటూ హిందూ సంఘాలు, ఆర్‌ఎస్‌ఎస్, శివ సేనలు ద్రవిడ కళగంపై తమ ప్రతాపం చూపించే వ్యూహంతో ఉరకలు పరుగులు తీస్తున్నాయి.



 ఎగ్మూర్‌లోని పెరియార్ తిడలపై దాడికి యత్నించి శివ సేన నాయకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించాల్సి వచ్చింది. వారు వచ్చిన ఆటోలో నాలుగు నాటు బాంబులు చిక్కడంతో కలకలం బయలు దేరింది. దీంతో ఆటోను, అందులోని బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చివరకు శివ సేన రాష్ట్ర నేతలు రాధాకృష్ణన్, కార్తికేయన్, రమేష్, ఏలుమలై తదితర 20 మందిని బుధవారం అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. ఈ తాళి వివాదం ఓ వైపు సాగుతున్న సమయంలో కుష్భు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా ద్రవిడ కళగంకు తన మద్దతు ఇచ్చారు. తాళి వ్యక్తిగతం :  తాళి ఉంచుకోవాలా..? తీసి వేయాలా..?, కట్టుకోవాలా...? వద్దా..?  అన్నది  వారి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారం పడి ఉందని కుష్భు వ్యాఖ్యానించారు.



 రోజు వారీగా జరుగుతున్న పెళ్లిళ్లను వెళ్లి ఆపలేదుగా, వారి నిరసనను ఈ రూపంలో తెలియజేయాలనుకున్నారు...అంతేగా అని పరోక్షంగా మద్దతు ఇచ్చారు. స్వతంత్ర భారత దేశంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేయడానికి వీలు ఉందని, ఎవరికి వారు తమకు తోచినట్టుగా భావాలను వ్యక్త పరుస్తుంటారని గుర్తు చేశారు. అంత మాత్రాన అడ్డుకోవడం, ఆందోళనల పేరుతో దాడులకు సిద్ధ పడటం మంచి పద్ధతి కాదని పరోక్షంగా హిందూ సంఘాలకు హితవు పలికారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. పెరియార్ ద్రవిడ సిద్ధాంతాల మేరకుద్రవిడ కళగం తమ నిరసనను వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. పెరియార్ చిత్రంలో మణియమ్మగా కుష్భు నటించిన విషయం గమనార్హం. కుష్భు పేర్కొన్నట్టుగానే టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ శివ సేన, హిందూ సంఘాల చర్యల్ని ఖండించారు.  



 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top