లోకేష్‌ నన్ను నాన్‌లోకల్‌ అన్నాడు: కేటీఆర్‌

లోకేష్‌ నన్ను నాన్‌లోకల్‌ అన్నాడు: కేటీఆర్‌ - Sakshi


ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా ఉన్న లోకేష్‌ గతంలో తనను నాన్‌ లోకల్‌ అని, తాను మాత్రమే లోకల్‌ అని చెప్పాడని, ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారని తెలంగాణ ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. లోకేష్‌ ఏపీ కేబినెట్‌ లో చేరగానే ఇక్కడ టీడీపీ మూత పడిందని అర్ధమని చెప్పారు. జగిత్యాల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు చెప్పారు. తనకు ఇప్పుడే ఏదో కావాలని లేదని, రాష్ట్రానికి మరో పదేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. తన తండ్రికి 64 సంవత్సరాల వయసున్నా ఆయన ఇంకా యంగ్‌గానే ఉన్నారని చెప్పారు. మూడేళ్లలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేశారని, మొండిగా వెళ్లే వ్యక్తే ఈ రాష్ట్రానికి కావాలని చెప్పారు. కాంగ్రెస్‌ అంటే ప్రజలకి మొహం మొత్తిందని, తాను మాత్రమే కాదు.. హరీష్‌ కూడా కేసీఆర్‌ నాయకత్వమే  ఉండాలనుకుంటున్నారని చెప్పారు. మూడేళ్ల తమ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.



సబ్సిడీ ఇవ్వడమే గగనం అనే పరిస్థితి నుంచి కూడా మార్పు తెచ్చామని, ఈ విషయంలో అప్పుడప్పుడు తమకే భయంగా ఉంటోందని కేటీఆర్ అన్నారు. సంక్షేమానికి దాదాపు రూ. 40వేల కోట్ల నుంచి నుంచి 46 వేల కోట్ల వరకు ఇస్తున్నామని చెప్పారు. జనహిత సభలను ఉద్దేశ పూర్వకంగానే పెట్టడంలేదని తెలిపారు. పంచాయత రాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేవాడినని, ఇప్పుడు డైరెక్ట్‌ పబ్లిక్‌ ఇంట్రాక్షన్‌ లేదని.. మున్సిపాలిటీ ఫోకస్‌తో ఎమ్మెల్యేలు రమ్మని పిలిస్తే ఒప్పుకున్నానని ఆయన అన్నారు. జగిత్యాలలో తాము ఓడిపోయామని, అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలనే తప్ప.. తనను సీఎం చేస్తారని ఇక్కడ సభలు పెట్టారనడం సబబు కాదని స్పష్టం చేశారు.



12 శాతం రిజర్వేషన్‌కి కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పా అని అడిగారు. బీజేపీ ఎన్నికల ముందు ఏం చెప్పినా జనాలకి నచ్చలేదని, అందుకే టీఆర్‌ఎస్‌ ను గెలిపించారని కేటీఆర్ అన్నారు. బీసీలకు అన్యాయం జరగబోదని, ఆరు నెలల్లో బీసీలకు కూడా రిజర్వేషన్‌ ఇస్తామని తెలిపారు. ఐదు మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్క కార్పొరేటర్‌ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు గానీ రాష్ట్రంలో పాగా వేస్తారా అని అన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top