కృష్ణవేణి.. తెలుగోడి వాణి..

కృష్ణవేణి.. తెలుగోడి వాణి.. - Sakshi


ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా కృష్ణవేణిరెడ్డి గెలుపు

తొలిసారి తెలుగువారికి ప్రాతినిథ్యం..

‘సాక్షి’లో ఒకప్పుడు ఆపరేటర్‌.. ఇప్పుడు కార్పొరేటర్‌




సాక్షి ముంబై: తెలుగు వారికి అందని ద్రాక్షగా మిగిలిన బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఈసారి ప్రాతినిథ్యం దక్కింది. బీఎంసీలో వార్డు నంబర్‌ 174 నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన కందిగ కృష్ణవేణి రెడ్డి విజయం సాధించారు.  ‘సాక్షి’ దినపత్రిక ముంబై కార్యాలయంలో ఒకప్పుడు ఆపరేటర్‌గా విధులు నిర్వహించిన ఆమె  ఇప్పుడు బీఎంసీ కార్పొరేటర్‌గా విజయం సాధిం చారు. ప్రతిక్షనగర్‌లో నివసించే ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2014 ఫిబ్రవరిలో సాక్షి ముంబై కార్యాలయంలో ఆపరేటర్‌గా చేరారు. 2015 మేలో పదవీ విరమణ చేసి.. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఆమెను బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలిచి, బీఎంసీలో తెలుగువారికి తొలిసారిగా ప్రాతినిథ్యాన్ని కల్పించారు.  



కడప నుంచి ముంబై వయా చిత్తూరు

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో జన్మించిన కృష్ణవేణి రెడ్డి వివాహం చిత్తూరు జిల్లా  కొత్త ఆరూరుకు  చెందిన వినోద్‌ రెడ్డితో  జరిగింది. ఆమె భర్త  ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు.  ఆయన ఫార్మా రంగంలో ఉండగా ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. కాగా, 2012లో జరిగిన ఎన్నికల్లో శివసేన టికెట్‌పై  176వార్డు (ధారావి–ట్రాన్సిస్ట్‌ క్యాంప్‌)నుంచి పోటీ చేసిన వరంగల్‌ జిల్లాకు చెందిన అనూషా వల్పదాసి విజయం సాధించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఆమె పదవి రద్దు అయిన సంగతి తెలిసిందే.



మార్పు కోరుకున్నారు..

‘‘రాజకీయ అనుభవంలేని నేను రాజకీయాల్లోకి రావడం, విజయం సాధించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ అనుభవం లేని మీరు రాజకీయ బురదలోకి ఎందుకొస్తున్నారు.. వచ్చినా.. ఎలా నెగ్గుకొస్తారని పలువురు ప్రశ్నించారు. అయితే నేను వారికి చెప్పే సమాధానమొక్కటే రాజకీయ బురదని అందరూ తప్పించుకుంటే ఎలా?  మహిళలతోపాటు యువత రాజకీయాల్లోకొస్తే కొత్త ఆలోచనలతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే నాకు అవకాశం కల్పించారు’’  

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top