ఉత్తమ్‌ సర్వే ఉత్తదే: కోమటిరెడ్డి

ఉత్తమ్‌ సర్వే ఉత్తదే: కోమటిరెడ్డి - Sakshi


2019 వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానంటూ తప్పుడు ప్రచారం



నకిరేకల్‌ /నల్లగొండ లీగల్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 55 సీట్లు వస్తాయని, 26 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  ప్రకటించడాన్ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు ఆయన సర్వే బోగస్‌ అని మండిపడ్డారు.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తప్పుడు సర్వేలతో అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించొ ద్దంటూ స్వపక్ష నేతలకు హితవు పలికారు.



గడ్డాలు, మీసాలు పెంచితే అధికారం రాదని ఉత్తమ్‌కు చురక లంటించారు. టీఆర్‌ఎస్‌ ను ఢీకొనాలంటే పోరుబాటే సరైన మార్గమని సూచించారు. నాడు వైఎస్‌ కార్య కర్తలు, ప్రజలను కలుపుకొని పోరుబాట సాగించి చంద్రబాబు పాలనను మట్టి కరిపించిన విషయాన్ని గుర్తు చేశారు.  2019 వరకు తానే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానంటూ ఉత్తమ్‌ తప్పుడు ప్రచారం చేయడం తగదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరిగేది ఎవరికీ అర్థం కాదని.. ఆయా సందర్భాల్లోనే అధిష్టానమే  నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.  



అక్రమ కేసులకు భయపడేది లేదు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయిం చినా భయపడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దౌర్జన్యంగా ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారం భించారన్న అభియోగం మేరకు కోమటిరెడ్డితోపాటు  ఆయన అనుచరులు 15 మందిపై 2015 ఆగస్ట్‌ 8న టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. కేసు వాయిదాకు శుక్రవారం ఎమ్మెల్యే తన అనుచరులతో కలసి నల్లగొండ కోర్టు న్యాయ మూర్తినారాయణరెడ్డి ఎదుట హాజరయ్యారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top