ఏర్పాట్లు ముమ్మరం


ఆసిఫాబాద్/కెరమెరి : గిరిజన ఆరాధ్యదైవం కుమ్రం భీం 76 వర్ధంతిని భీం పురిటిగడ్డ జోడేఘాట్‌లో ఈ నెల 16న అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమైక్య పాలనలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ప్రజాప్రతినిధులు, అధికారులను జోడేఘాట్‌కు అనుమతించకపోవడంతో అధికారులు హట్టిబేస్ క్యాంప్ వద్దనే నివాళులర్పించేవారు. ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్  రెండేళ్ల క్రితం తొలిసారివర్ధంతి సభకు హాజరై నివాళులర్పించారు.

 

జోడేఘాట్ అభివృద్ధికి వరాల జల్లు ప్రకటించారు. రూ.25 కోట్లతో జోడేఘాట్‌లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండేళ్లుగా పనులు చురుకుగా సాగుతున్నాయి. పర్యాటక నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జల్‌జంగల్ జమీన్‌కు గుర్తుగా ముఖద్వారాలు నిర్మించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతిని తలపించే మ్యూజియూనికి ఆకర్శణీయ రంగులు వేశారు. వర్దంతి ఏర్పాట్లలో భాగంగా భీమ్ స్మారక స్తూపం వద్ద గ్రానైట్ రాయితో శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు.

 

 ఏర్పాట్ల పరిశీలన

 జోడేఘాట్‌లో వర్ధంతి ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు చంపాలాల్, కర్ణన్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. భీం స్మారక పనులను పరిశీలించారు.  భీం విగ్రహానికి రామన్న పూల మాల వేసి నివాళి అర్పించారు.

 

 తర్వాత  భీం సృ్మతివనం, మ్యూజీయం, హంపీథియోటర్‌ల నిర్మాణాలను పరిశీలించారు. మ్యూజియంలో అలంకరించనున్న గుస్సాడీ ప్రతిమలు, వాయిద్యాలు వాయిస్తున్న కళాకారులు,  కుమ్రం భీంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజల ప్రతిమలను పరిశీలించారు. గిరిజనుల సంస్కృతి, ఆచార వ్యవహారాలను చూసి ఆనందపడ్డారు. హంపీథియేటర్ పనులను చూశారు.  గతంలో సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల్లో మ్యూజియం పనులు పూర్తయ్యే దశలో ఉండగా, డబుల్ బెడ్ రూం పనులు పూర్తి కాలేదు.

 

 మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ ర్ధంతి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు, సీఎం పర్యటనకు సన్నాహాలు చేస్తున్నా సీఎం పర్యటనపై అనుమానాలు ఉన్నాయి. వర్ధంతిని పురస్కరించుకొని మూడు రోజులుగా పోలీసు బలగాలు జోడేఘాట్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నుంచి జోడేఘాట్ వరకు అడుగడుగునా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top