నిధుల బదిలీ వివాదం మరో రాజకీయ గిమ్మిక్కు


 న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ఎమ్మెల్యేల నిధుల మరలింపు విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేయడాన్ని మరో రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు, ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజేందర్‌గుప్తా మీడియాతో మాట్లాడుతూ అరవింద్.. అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరద బాధితులకు తమ నిధులను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ ఎల్జీ అడ్డుకున్నాడని అనడం సరికాదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు అరవింద్ యత్నిస్తున్నాడని ఆరోపించారు. కాగా నగర పరిధిలోని ఎమ్మెల్యేలు స్థానిక అభివృద్ధి నిధులను జమ్మూకాశ్మీర్‌కు చెందిన వరదబాధితులకు విరాళాల కింద ఇచ్చేందుకు ఎల్జీ అనుమతించారంటూ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఎల్జీ కార్యాలయం పేర్కొంది.

 

 మార్గదర్శకాల్లో మార్పులు

 జాతీయ విపత్తుల సమయంలో ఎమ్మెల్యేలకు కేటాయించే నిధుల్లో మార్గదర్శకాల్లో ఢిల్లీ ప్రభుత్వం సవరణలు చేపట్టింది. తాజా మార్పులుచేర్పుల ప్రకారం  ఎమ్మెల్యేలు  తమ నిధుల్లో నుంచి రూ. 4 కోట్ల వరకూ విపత్తి సహాయనిధి కింద ముఖ్యమంత్రి లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేయవచ్చు. గతంలో విరాళాల కేటాయింపునకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆ ఆంక్షల ప్రకారం ఎమ్మెల్యేలు తమ నిధుల్లోనుంచి ఐదు శాతంగానీ లేదా గరిష్టంగా రూ. 35 లక్షలను గానీ ముఖ్యమంత్రి లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌లకు సహాయ నిధికి అందజేయాల్సి ఉంటుంది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top