జిల్లాల విభజనతో కేసీఆర్ పతనం ప్రారంభం


-ప్రజల క్షణికావేశంతోనే టీఆర్‌ఎస్‌కు అధికారం

-హన్మకొండ విడదీస్తే ఆమరణ దీక్ష

-కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ



జనగామ(వరంగల్ జిల్లా)


 జిల్లాల విభజనతోనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పతనం మొదలైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయద్దని, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన జిల్లా బంద్‌లో ఆయన పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వరంగల్‌లో, జనగామలో సర్వే సత్యనారాయణ మాట్లాడారు. భువనగిరి ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినందునే యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చిందన్నారు. మైహోమ్స్ రామేశ్వర్‌రావు ఒక జిల్లా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటెల కోసం మరో జిల్లా ఇస్తున్నాడని అన్నారు.


 


జనగామను జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, జిల్లా ప్రజలంతా ఇవ్వాలని కోరుతున్నా సీఎం మొండివైఖరి అవలంభించడం సబబు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ జిల్లా జనగామ చేస్తానని మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఘోరంగా మోసం చేశాడన్నారు. వరంగల్‌ను విడదీస్తే చరిత్రకు చేటు తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ మిగిలి పోతారని అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయం మార్చుకోకుంటే తాను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా అయినప్పటికీ ప్రజల క్షణికావేశంతో తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాడని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి, నేరవేరలేని వాగ్దానాలు ఇవ్వడంతో ప్రజలు నమ్మి ఆయన పార్టీని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారందరికీ పెన్షన్‌లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తుందన్నారు. కాలేజీల తనిఖీల పేరుతో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్య అందడం లేదన్నారు. మరో రెండు నెలల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్థానంలో నేనే వస్తున్నా.. ఏంటో చెప్పను.. చమత్కారం చూస్తారు అని సర్వే అన్నారు.


 


డీసీసీ అధ్యక్షుడు నాయినీ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హన్మకొండ జిల్లా వద్దని, జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు ఇచ్చిన బంద్‌ను జిల్లా ప్రజలు విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రజల అకాంక్ష మేరకు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీను, కొత్తపల్లి శ్రీనివాస్, రజనీకాంత్, మైనంపాటి శ్రీను, ధన్‌రాజ్ పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top