పేరే శాపమైంది!

పేరే శాపమైంది! - Sakshi


నెల రోజులుగా సౌదీ పోలీసుల అదుపులో కర్ణాటక వాసి నయాజ్‌

అసలు నిందితుడిది, నయాజ్‌ది ఒకటే పేరు కావడంతో     పొరబడిన పోలీసులు

తీర్థయాత్రకెళ్లి చిక్కుకుపోయిన వైనం




తుమకూరు (కర్ణాటక): ఇద్దరిదీ ఒకే పేరు, ఒకే పుట్టిన రోజు ఉండటంతో సౌదీ అరేబియాలో ఒక కన్నడిగుడు చేయని నేరానికి కటకటాల పాలయ్యాడు. తుమకూరు జిల్లా నుంచి యాత్రకు వెళ్ళిన నయాజ్‌ను విచారణ పేరుతో అరెస్ట్‌ చేసి నెల రోజుల నుంచి జైల్లో ఉంచారని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. తుమకూరు జిల్లాలోని తురువెకెరె పట్టణంలోని సుబ్రమణ్య ప్రాంతానికి చెందిన నయాజ్‌ అహ్మద్‌ (41) ప్రస్తుతం సౌదీలో పోలీసుల చెరలో చిక్కుకున్నాడు.



బెంగళూరుకి చెందిన నయాజ్‌ అనే యువకుడు సౌదీలో ఉంటూ అక్కడ నేరం చేసి పారిపోయి వచ్చాడు. అతని కోసం సౌదీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ తరుణంలో నయాజ్‌ అహ్మద్‌ తన స్నేహితులతో ఉమ్రా తీర్థయాత్రలకు ఏప్రిల్‌ 20న సౌదీ వెళ్ళాడు. నయాజ్‌ అహ్మద్‌ది, బెంగళూరు నయాజ్‌ది పేరు, పుట్టినరోజు ఒక్కటే కావడంతో సౌదీ పోలీసులు పొరబడి నయాజ్‌ అహ్మదే నిందితుడని భావించి అదుపులోకి తీసుకున్నారు.



ప్రధాని, విదేశాంగమంత్రి జోక్యం చేసుకోవాలి..

నయాజ్, నయాజ్‌ అహ్మద్‌ల ముఖకవళికలు ఒకేలా ఉండటం, ఇద్దరి పాస్‌పోర్టులు బెంగళూరు పాస్‌పోర్టు కార్యాలయమే మంజూరు చేయడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుంటున్నా మని, విచారించి వదిలేస్తామని నయాజ్‌ అహ్మద్‌ స్నేహితులకు సౌదీ పోలీసులు చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. నెల రోజులు గడిచినా ఇప్పటివరకు వివరాలు తెలియకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లు చొరవ తీసుకుని తమ కుమారుడిని విడిపించాలని నయాజ్‌ అహ్మద్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top