అన్నయ్య కోసం!

అన్నయ్య కోసం!


 పెద్దన్నయ్య అళగిరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని తండ్రి కరుణానిధిపై ఒత్తిడి తెచ్చేపనిలో గారాల పట్టి కనిమొళి నిమగ్నమయ్యారు. ఈ విషయంపై ఆమె గంటకు పైగా తన తండ్రితో భేటీ అయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్య ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాల్సిం దేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇప్పుడు డీఎంకేలో దీనిపైనే చర్చసాగుతున్నట్టు తెలుస్తోంది.

 

చెన్నై : డీఎంకేలో అన్నదమ్ములు అళగిరి, స్టాలిన్ మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితుల్ని చక్కదిద్దే పనిలోపడ్డ అధినేత కరుణానిధి మళ్లీ అళగిరిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. అళగిరితో సాగిన రాయబారాలు బెడిసికొట్టడంతో ఆయన్ను మళ్లీ ఆహ్వానించాలా? అన్న సందిగ్దతలో డీఎంకే శ్రేణులు పడ్డాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో రెండు రోజుల క్రితం అళగిరి డీఎంకే అధిష్టానంపై విరుచుకుపడ్డారు. స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు అళగిరికి, పార్టీకి మధ్య మరింత ఆగాదాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు.

 

 పార్టీలోకి అళగిరిని మళ్లీ ఆహ్వానించబోమన్న స్పష్టమైన హామీని కరుణానిధి నుంచి స్టాలిన్  తీసుకున్నట్టుగా, అందుకే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున సీఎం అభ్యర్థి కరుణానిధి ఉంటారన్న వ్యాఖ్యను స్టాలిన్ చేసినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అళగిరిని పార్టీలోకి ఆహ్వానిస్తే, ఎక్కడ స్టాలిన్ అలక వహిస్తాడోనన్న ఆందోళనలోపడ్డ కరుణానిధి ఆ ప్రయత్నాల్ని విరమించుకునేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దన్నయ్యకు అండగా నిలబడేందుకు కరుణ గారాల పట్టి కనిమొళి సిద్ధమైనట్టు ఉన్నారు. కరుణానిధిని బుజ్జగిం చేందుకు అన్నయ్య తరపున రాయబారం సాగించేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం డీఎంకేలో సాగుతోంది.

 

 ‘కని’ రాయబారం

 ఎప్పుడూ కనిమొళి ఇంటిమెట్లు ఎక్కని అళగిరి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తొలిసారిగా అడుగు పెట్టారని చెప్పవచ్చు. తన ఆవేదనను అంతా చెల్లెమ్మ వద్ద అళగిరి ఇటీవల వెళ్లగక్కారు. మదురైకు వెళ్లిన సందర్భంలో అన్నయ్యన్ను కనిమొళి ఓదార్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అళగిరి ఎక్కడ శాశ్వతంగా పార్టీకి దూరమవుతారోనన్న ఆందోళనలో పడ్డ కనిమొళి, మళ్లీ ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ఉన్నారన్న ప్రచారం డీఎంకేలో జోరందుకుంది. కరుణానిధితో ఈ విషయంగా గంటకు పైగా కనిమొళి భేటీ అయినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.


దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించాల్సిందేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అన్నయ్య మళ్లీ పార్టీలోకి రాక కోసం కొన్ని పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయన్న విషయాన్ని కరుణ దృష్టికి తీసుకెళ్లినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కరుణానిధి సీఎం అన్న ప్రకటనను స్వయంగా చిన్నన్నయ్య స్టాలిన్ చేయబట్టే, అదే రోజు ఎండీఎంకే నేత వైగో మిత్రులతో కూటమికి రెడీ అన్న సంకేతాన్ని పంపించారన్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది.

 

 ఎండీఎంకే నేతలతో పాటు దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న నాడార్లు, ఉత్తర తమిళనాడులో బలంగా ఉన్న వన్నియర్లు, సెంట్రల్ తమిళనాడులోని ముత్తయ్యార్ సామాజిక వర్గాల నాయకులు డీఎంకే వైపు చూస్తున్నారన్న విషయాన్ని వివరించి ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆ వర్గాలకు న్యాయం చేకూర్చే రీతిలో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పెద్దన్నయ్యను మళ్లీ ఆహ్వానించాలని కరుణానిధిపై కనిమొళి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తనకు కనిమొళి గారాల పట్టి కావడంతో అళగిరిమీద ఉన్న కోపాన్ని కరుణానిధి దిగమింగి, ఎన్నికలు సమీపించనీ.. చూద్దామన్న హామీని ఆమెకు ఇచ్చినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top