రీడిజైనింగ్‌ పేరుతో ఖజానాకు తూట్లు

రీడిజైనింగ్‌ పేరుతో ఖజానాకు తూట్లు - Sakshi


సీఎల్‌పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి డి. శ్రీధర్‌బాబు



మహదేవపూర్‌: తెలంగాణలోని 50 లక్షల ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర రాజధానికి తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన కేసీఆర్‌.. రాష్ట్ర ఖజనాకు తూట్లు పొడిచాడని సీఎల్‌పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌ల కింద పంట భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయపరమైన పరిహారం ఇవ్వాలంటూ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో మంగళవారం మహదేవపూర్‌లో చేపట్టిన నిరసన దీక్షలో జీవన్‌రెడ్డి ప్రసంగించారు.



ప్రాజెక్టుల వల్ల నష్టపోతున్న రైతాంగానికి అండగా 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని, ఆనాడు పార్లమెంట్‌లో ఉన్న కేసీఆర్‌ కూడా చట్టానికి మద్దతు తెలిపి.. ఈ రోజు తలాతోకలేని చట్టమని అంటున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ప్రాణహిత–చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.40 వేల కోట్లు మంజూరు చేసేదని, రీడిజైనింగ్‌ పేరుతో ప్రాజెక్టును మూడు ముక్కలు చేసి జాతీయహోదా రాకుండా చేయడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు రూ.లక్ష కోట్లు భారం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ నిరసన దీక్షకు సీపీఐ, సీపీఎం, ఆదివాసీ ఐక్యవేదిక, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, గోలివాడ, మల్లన్నసాగర్‌ రైతులు సంఘీభావం తెలిపారు.  



రీయింబర్స్‌మెంట్‌పై చిత్తశుద్ధి లేదు: జీవన్‌రెడ్డి

జగిత్యాల రూరల్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని జగిత్యాల ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఐఎం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థుల ఉన్నత చదువుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేశారని అన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top