దీపా యూ టర్న్‌?

దీపా యూ టర్న్‌?


సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్‌ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు వ్యతిరేకంగా స్పందిస్తే, మేనకోడలు దీపా మాజీ సీఎం పన్నీరు సెల్వంకు షాక్‌ ఇచ్చేలా సిద్ధం అవుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం చోటు చేసుకున్నాయి. ఇక, శుక్రవారం దీపా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి.



దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసురాలు తానేనని ఆమె మేన కోడలు దీపా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకేలోని కింది స్థాయి కేడర్‌ ఆమె ఇంటి ముందు వాలిపోయారు. ఈ సమయంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం పెదవి విప్పడంతో దీపా ఇంటి ముందుకు కేడర్‌ రాక తగ్గిందని చెప్పవచ్చు. పన్నీరు శిబిరం వైపుగా కేడర్‌ పరుగులు తీయడంతో తాను సైతం అని దీపా స్పందించారు. పన్నీరు శిబిరానికి తన మద్దతు ప్రకటించారు. ఆ తదుపరి ఎన్నడూ ఆ శిబిరం వైపుగా ఆమె వెళ్ల లేదు. తమను కలుపుకొని వెళ్లడం లేదంటూ దీపా మద్దతుదారులు పన్నీరు శిబిరంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు.



ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా ఆ శిబిరంలో ఉన్న జయలలిత మేనల్లుడు దీపక్‌ పెదవి విప్పి సంచలనం సృష్టించారు. అదే సమయంలో పన్నీరు శిబిరానికి షాక్‌ ఇచ్చే రీతిలో దీపా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు దీపా ఇంటి పరిసరాల్లో తాజాగా చోటు చేసుకోవడం గమనార్హం.



పన్నీరు శిబిరంలోకి చేరిన దీపా, హఠాత్తుగా యూటర్న్‌ తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. దీపా పేరవై వర్గాలు ఏకంగా పన్నీరు శిబిరం మీద విమర్శలు గుప్పించే పనిలో పడ్డ నేపథ్యంలో గురువారం టీనగర్‌లో కొత్త జెండాలు ప్రత్యక్షం అయ్యాయి.  దీపా ఇంటి పరిసరాల్లో ఈ జెండాలు హోరెత్తడంతో పన్నీరుతో కలిసి అడుగులు వేయకుండా, మేనత్త చరిష్మాతో ఒంటరిగానే ముందుకు సాగేందుకు ఆమె నిర్ణయించారా అన్న ప్రశ్న బయలు దేరింది. అన్నాడీఎంకే జెండా తరహాలో నలుపు, తెలుపు, ఎరుపు వర్ణాలతో మధ్యలో జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై చిత్ర పటాలను ఆ జెండాల్లో పొందు పరచడంతో దీపా కొత్త పార్టీ ప్రకటిస్తారా అన్న చర్చ ఊపందుకుంది.



పన్నీరు నేతృత్వంలో శుక్రవారం ఆర్కేనగర్‌ వేదికగా జరగనున్న సభకు దీపా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు ఆ పేరవై వర్గాలు వ్యాఖ్యానిస్తుండడం ఉత్కంఠకు దారి తీసింది. జయలలిత జయంతి సందర్భంగా జరగనున్న ఈ సభలో దీపా కూడా కనిపిస్తారన్న ఆశతో పన్నీరు శిబిరం ఉన్నా, ఆమె హాజరయ్యేది అనుమానమేనని పేరవై వర్గాలు పేర్కొంటుండడం గమనించాల్సిన విషయం. ఉదయాన్నే మేనత్త జయలలిత సమాధి వద్ద నివాళులర్పించినానంతరం ఇంటి వద్దకు చేరుకునే దీపా, మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు పేరవై వర్గాలు పేర్కొంటుండడంతో అందరిచూపు టీనగర్‌ వైపుగా మరలింది.



మేనత్త జయంతి సందర్భంగా దీపా ఏ ప్రకటన చేస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి.  పన్నీరు శిబిరం మాత్రం దీపా తమ సభకు తప్పకుండా హాజరవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top