ఆల్‌ఫ్రీపై విమర్శలు

ఆల్‌ఫ్రీపై విమర్శలు


సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రంపై రూ.50 వేలకోట్ల అదనపు భారం పడుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పార్టీల మేనిఫెస్టోల విడుదల ముగిసిన తరువాత గురువారం సాయంత్రం అమ్మ తన హామీల పట్టికను వెల్లడించారు. అమ్మ మేనిఫెస్టోలో మహిళలు, విద్యార్థులు, రైతులకు అనేక  ఉచిత పథకాలను పే ర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇప్పటికే అనేక ఉచిత పథకాలు అమలులో ఉండగా, మళ్లీ ప్రభుత్వం వస్తే మరిన్ని ఉచితాలు ఉంటాయని అమ్మ హామీ ఇచ్చారు.



అమ్మ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల మాటెలా ఉన్నా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న ఆర్థిక భారాన్ని మాత్రం అందరూ లెక్కకడుతున్నారు. ఉచితాలపై చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే ప్రభుత్వంపై రూ.50వేల కోట్ల ఆర్థిక భారం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అదనపు భారంలో 50 శాతం సబ్సిడీపై ద్విచక్రవాహనాలు అగ్రస్థానం నిలిచి ఉంది. ఈ పథకానికి మాత్రమే ఏడాదికి రూ.45 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఏడో పే కమిషన్‌ను అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసినట్లయితే రూ.15వేల కోట్లు అవసరం అవుతుంది. రైతుల అన్నిరకాల రుణాల మాఫీకి రూ.5,500 కోట్లు కేటాయించాలి. అరసు కేబుల్ టీవీ కనెక్షన్, ఉచితంగా సెట్‌అప్ బాక్స్‌కు రూ.1500 కోట్లు,ప్రతి రేషన్‌కార్డు దారుడికి ఉచిత సెల్‌ఫోన్‌కు రూ.2వేల కోట్లు సిద్ధం చేసుకోక తప్పదు.



వంద యూనిట్ల వినియోగదారునికి ఉచిత విద్యుత్ పథకం మరో ముఖ్యమైన హామీగా ఉంది. రాష్ట్రంలో 78.55 లక్షల కుటుంబాలు 100 యూనిట్లకు లోబడి వినియోగిస్తున్నారు. వీరి సబ్సిడీ కోసం ఏడాదికి రూ.2,560 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. పాల ధర తగ్గింపు హామీతో ఏడాదికి రూ.1000 కోట్లు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం టిఫిన్ హామీకి రూ. రూ.600 కోట్లు, వివాహాల ఆర్థిక సహాయానికి ఏడాదికి రూ.200 కోట్లు అవసరం. అన్నాడీఎంకే ప్రభుత్వ పథకాలకు ఐదేళ్లకు రూ.1.50 లక్షల కోట్లు అవసరమని గణాంకాల నిపుణులు లెక్కకట్టారు.

 

అమ్మ మేనిఫెస్టోపై ఆక్షేపణలు:

అధికార అన్నాడీంకే మేనిఫెస్టో కోసం ఆత్రంగా ఎదురుచూసిన ప్రతిపక్షాలు ఆక్షే పణలు గుప్పించాయి. డీఎంకే మేనిఫెస్టోను జిరాక్స్ కాపీ తీసి దానికి జయ తన ఫొటోను అతికించుకున్నారని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎద్దేవా చేశారు. అన్నింటికీ తన స్టిక్కర్లు అంటించుకోవడంలోనే ఆమె ఆనందాన్ని వెతుక్కుంటారని వ్యాఖ్యానించారు. అమ్మ ప్రకటించిన పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయేగానీ, అభివృద్ధిని సూచించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు.



ఉచితంగా వస్తువులను ఇచ్చి ప్రజలను మోసం చేసే రోజులకు కాలం చెల్లిందని అన్నాడీఎంకే మేనిఫెస్టోను ఉద్దేశించి పీఎంకే వ్యవస్థాప అధ్యక్షులు డాక్టర్ రాందాస్ వ్యాఖ్యానించారు. ఈ మేనిఫెస్టో చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చిన తీరులో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న వైనాన్ని అమ్మ మేనిఫెస్టో బైటపెట్టిందని అన్నారు. అభివృద్ధి పథకాలకు ఏమాత్రం తావివ్వకుండా ఉచితాలను పంచడం ద్వారా రాష్ట్రాన్ని మరింత తిరోగమనానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ మేనిఫెస్టో వెనుక ఉన్న నష్టాన్ని గుర్తించి తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జయలలిత ఇచ్చే సెల్‌ఫోన్లు వాడితే అవి అమ్మా...అమ్మా అని మాత్రమే అంటాయని డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ఎద్దేవా చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top