జయకు ఊరట!

జయకు ఊరట!


ఆదాయపు పన్ను దాఖలు కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఊరట లభించనుంది. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ నిర్ణరుుంచింది. సుమారు 18 ఏళ్లుగా జయలలిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసు మరో వారంలో కొలిక్కి రానుంది.

 

సాక్షి, చెన్నై: జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ పై ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన కేసు విచారణ ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో చెన్నై ఎగ్మూర్ కోర్టులో సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ పలు మార్లు ఆ ఇద్దరికి సమన్లు జారీ అయ్యూరుు. అరుుతే ఏదో ఒక కారణంతో వాయిదాలతో డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ కేసు విచారణ ముగింపునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సైతం ముగిసింది. దీంతో విచారణను త్వరితగతిన ముగించే విధంగా న్యాయమూర్తి దక్షిణామూర్తి కార్యచరణ సిద్ధం చేశారు.



ఈ పరిస్థితుల్లో జయలలితకు జైలు శిక్ష పడడంతో కేసు మళ్లీ వాయిదాలతో సాగుతోంది. తదుపరి విచారణ మరో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు జయలలిత తరపు న్యాయవాదులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. ఇది వరకే ఆదాయపన్ను శాఖ కేంద్ర కమిషన్ వద్ద జయలలిత తరుపున విజ్ఞాపన పెండింగ్‌లో ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఆ కమిషన్ సామరస్య పూర్వక పరిష్కారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

 

జరిమానా కట్టేందుకు సిద్ధం

ఆదాయపు పన్నును జరిమానాతో కలిపి కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని జయలలిత తరపున ఆదాయపన్ను శాఖకు స్పష్టమైన సంకేతం వెళ్లింది. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జయలలిత తరపు విజ్ఞప్తిని అంగీకరించిన ఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక కమిషన్ సానుకూలత వ్యక్తం చేసింది. చెల్లించాల్సిన మొత్తాన్ని చెన్నైలోని ఆదాయపు పన్ను శాఖ ప్రకటిస్తుందని పేర్కొంది.



ఆదాయపు పన్నును జరిమానాతో కలిపి కట్టేందుకు జయలలిత తరపు ప్రతినిధులు సిద్ధమయ్యారు. సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారం కావడంతో ఇక ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ఆదాయపన్ను శాఖ తేనుంది. మరో వారంలో ఎగ్మూర్ కోర్టు ముందు తమ వాదన వినిపించనుంది. తర్వాత జయలలితకు ఊరట కలిగించే విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top