అమ్మపేరు ఖరారు

అమ్మపేరు ఖరారు


చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్కేనగర్) ఉప ఎన్నికలో జయలలిత అన్నాడీఎంకే అభ్యర్థిగా ఖరారయ్యారు. అన్నాడీఎంకే  ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం తన పేరును తానే ప్రకటించుకున్నారు.



* అన్నాడీఎంకే అభ్యర్థిగా జయలలిత

* గట్టి పోటీ లేని ఉప ఎన్నిక



చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్షపడిన కారణంగా గత ఎన్నికలలో తాను పోటీచేసి గెలుపొందిన శ్రీరంగం స్థానాన్ని కోల్పోయారు. జయ వల్ల ఖాళీఅయిన శ్రీరంగం నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన వలర్మతి గెలుపొందారు. ఆస్తుల కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడగా ఈనెల 23 వ తేదీన జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. జయ శాసనసభ్యురాలు కానందున ఆరునెలల్లోగా అసెంబ్లీ సభ్యత్వాన్ని పొందాల్సి ఉంది.



ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక మునుపే చెన్నై నగరంలో అంతర్భాగమైన ఆర్కేనగర్ నియోజకవర్గాన్ని జయ సిద్ధం చేసుకున్నారు.ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ చేత హడావిడిగా  రాజీనామా చేయించారు. దీంతో ఆర్కేనగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 3 వ తేదీన నోటిఫికేషన్ వెలువడ నుండగా  27వ తేదీన ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికపై పోలింగ్ జరుగనుంది. ఎమ్మెల్యే స్థానానికి జయ ఆరుసార్లు పోటీచేయగా ఒక్కసారి ఓటమిపాలైయారు. ఓటమిపాలైన సమయంలో రెండుచోట్ల నుండి పోటీచేసినందున ఎమ్మెల్యే ప్రాతినిధ్యాన్ని దక్కించుకున్నారు.



ఆర్కేనగర్‌లో పోటీచేయడంపై ప్రతిపక్షాలు పెద్దగా ఆసక్తి చూపనందున జయ గెలుపు నల్లేరుపై నడక కాగలదు. అనారోగ్య కారణాల వల్లనే స్థానిక నియోజకవర్గాన్ని జయ ఎంచుకున్నారనే ప్రచారం ఉంది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మినహా మరెవ్వరూ పోటీకి ముందుకు రాని పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో జయ పాల్గొనడం కూడా అనుమానమని తెలుస్తోంది.



గతంలో ఓటమి అనుభవంతో ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నటి కుష్బు పేరు ప్రచారంలో ఉండగా, ఆమె మాత్రం కొట్టిపారేశారు. కాంగ్రెస్ అధిష్టానం కోరినా పోటీకి దిగేది లేదని ఆమె స్పష్టం చేశారు. డీఎంకే సైతం ఎన్నికలకు దూరమని ప్రకటించేసింది. మిగిలిన ప్రతిపక్షాలు గట్టి అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో జయ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top