విస్తుగొలిపిన విలాసవంత జీవితం..

ఆరేళ్లలో 21 విదేశీ ట్రిప్‌లు... - Sakshi


సాక్షి, ముంబయి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీ అధికారి వివేక్‌ బాత్రా విలాసవంత జీవితం విస్తుగొలుపుతుంది. ఆరేళ్లలో ఆయన తనే భార్యతో కలిసి 21 సార్లు విదేశాలను చుట్టివచ్చారు. వీరు కేవలం ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది సార్లు అమెరికాను సందర్శంచారు. ఐటీ అధికారి వివేక్‌ బాత్రా అక్రమంగా ఆర్జించిన సొమ్మును స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన డొల్ల కంపెనీలకు తరలించేవారని సీబీఐ వెల్లడించింది. బాత్రా దంపతుల విలాసవంత లైఫ్‌స్టైల్‌ పైనా సీబీఐ దృష్టి సారించింది.



మహాలక్ష్మి రేస్‌కోర్సులో జరిగిన ఓ చిన్న పార్టీలో కేవలం డ్రింక్స్‌ కోసమే వీరు రూ 50,000 వెచ్చించారని తెలిసింది. దంపతులిద్దరూ తరచూ నగరంలోని సెలబ్రిటీ పార్టీల్లో దర్శనమిస్తుంటారు. ముంబయిలో ఆదాయపన్ను అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న బాత్రాపై గతనెలలో సీబీఐ ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిఉన్నారని కేసు నమోదు చేసింది. బాత్రా దంపతులు 2008 నుంచి 2017 మధ్య రూ 6.79 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో బాత్రా సీఏ, రెండు కంపెనీల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లపైనా కేసులు నమోదయ్యాయి. 2005లోనూ బాత్రాపై సీబీఐ అభియోగాలు మోపింది. అప్పట్లో సీబీఐ ఆరోపణలను ఆయన న్యాయస్ధానాల్లో సవాల్‌ చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top