మార్కెట్లో మరో మాయ..

మార్కెట్లో మరో మాయ..

వినియోగం లేకున్నా నెలకు రూ.57వేల డీజిల్‌ వాడకం

కారు అద్దె పేరుతో నెలకు రూ.24 వేలు

 

వరంగల్‌సిటీ : వరంగల్‌ అర్బన్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో తొవ్విన కొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా పాలక వర్గానికి తెలియకుండా కేవలం మార్కెట్‌ ఉద్యోగుల కుమారులు, కూతుళ్లనే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించుకోగా, కారు అద్దె పేరుతో నెలకు రూ.24వేలు, నెలకు రూ.57వేల డీజిల్‌ వినియోగం అవుతున్నట్లు బిల్లుల లెక్కలల్లో వెలుగు చూసింది.

 

ఎలా జరిగిందంటే..

మార్కెట్‌ కార్యదర్శి కారు అద్దె రూపంలో నెలకు రూ.24వేల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ రూ.24 వేలల్లోనే 2500ల కిలోమీటర్ల మేరకు డీజిల్‌ వినియోగంతోపాటు, డ్రైవర్‌ కూడా అద్దె ఏజెన్సీ వారే భరిస్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా మార్కెట్‌ కార్యదర్శి ఓ బినామీ పేరుతో కారును   కొనుగోలు చేసి, నెలకు 2500ల కంటే ఎక్కువ తిరుగుతున్నట్లు లెక్కలల్లో చూపిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లోని డ్రైవింగ్‌ వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డును డ్రైవర్‌గా వినియోగించుకుంటు నెలకు రూ. 24వేలతో పాటు మరో రూ.10వేలు కలుపుకుని మొత్తంగా  రూ. 34వేల వరకు కాజేస్తున్నట్లు బిల్లుల లెక్కలు తెలుపుతున్నాయి. అదే విధంగా మార్కెట్లో నెలకు రూ.57 వేల డీజిల్‌ వినియోగం అవుతున్నట్లు ఓ పెట్రోల్‌ బంకు యజమానితో కుమ్మ  క్కై బిల్లులు తయారు చేసి డబ్బులు స్వాహా చేస్తున్నట్లు బిల్లుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యుత్‌ కూడా పోకపోవడంతో జనరేటర్‌కు డీజిల్‌ వాడే ప్రసక్తే లేదు. దీంతో రూ.57 వేల డీజిల్‌ వాడకానికి లెక్కలు సరిగా సరిపోవడం లేదు.  సంవత్సరానికి కేవలం డీజిల్‌ వినియోగం, కారు అద్దె పేరు మీదే రూ. 12లక్షల వరకు డబ్బులు మాయం అయినట్లు పాత బిల్లులను బట్టి తెలుస్తోంది. 

 

డీజిల్‌ లెక్కలు చూపడం లేదు

 సెక్యూరిటీ గార్డును కారు డ్రైవర్‌గా ఎందుకు వినియోగించుకుంటున్నారో కార్యదర్శిని అడిగితే చెప్పడం లేదు. అంతేకాకుండా రూ.57వేల డీజిల్‌ బిల్లు లెక్కలు చెప్పడం లేదు. నేను ఈనెల రోజుల్లో ఇంత వరకు లీటర్‌ డీజిల్‌ కూడా వినియోగించలేదు. బిల్లులు నా వద్దకు సంతకానికి వస్తే విషయం తెలిసింది.  ఎన్ని డబ్బులు దుర్వియోగం అయ్యాయొ ఆరా తీస్తున్నాను.         

– ధర్మరాజు, చైర్మన్
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top