నాన్నా.. నువ్వు చచ్చిపోవద్దు!

కొడుకు ఫృథ్వీ, భార్య, కూతుళ్లతో ధన్ రాజ్ షిండే - Sakshi


'నాన్న రోజులా లేడు. అప్పుడప్పుడు ఆయన బాధపడటం చూశాను గానీ ఆరోజు మాత్రం కచ్చితమైన తేడా కనిపించింది. అంతసేపూ కూర్చుని దీర్ఘంగా ఆలోచించినవాడు కాస్తా వడివడిగా బయటికి నడిచాడు. ఎప్పుడూ ఆయన వెంట తీసుకెళ్లే సెల్ ఫోన్ గానీ, పనిముట్ల సంచి గానీ లేకుండా పొలం ఉన్నదిక్కుకు పరుగులాంటి నడకతో వెళుతున్నాడు. నాలో తెలియని భయం మొదలైంది. వెంటనే లేచి నేనూ పొలానికి పరుగుపెట్టా..



పొలానికి మూలన ఉన్న చెట్టు దగ్గర నాన్న కనిపించాడు. అప్పటికే ఉరికొయ్య పేనడం పూర్తయింది. తాడు మెడలో వేసుకుని కళ్లు మూసుకున్నాడు. నాన్న ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎలా పరుగెత్తానో నాకే గుర్తులేదు. మరుక్షణంలో నాన్న దగ్గరికి వెళ్లి మెడకు బిగుసుకున్న ఉరితాడును తీసేసే ప్రయత్నం చేశాను. కళ్లు తెరిచి నన్ను చూసిన నాన్న ఏడవటం మొదలుపెట్టాడు. 'నాన్నా నువ్వు చనిపోతే మాకు దిక్కెవరు?' గట్టిగా నాన్నను పట్టుకుని నేనూ ఏడ్చాను. కొద్దిసేపటికి ఇద్దరం కలిసి ఇంటికొచ్చాం. జరిగిన సంగతి అమ్మా, అక్కలకు చెప్పా. వాళ్లకైతే గుండె ఆగినంత పనైంది' అంటూ మూడు రోజుల కిందట జరిగిన సంఘటనను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు 14 ఏళ్ల పృథ్వీరాజ్ షిండే.



మహారాష్ట్రలోని లాతూర్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న దుర్భిక్షం ఎంత తీవ్రంగా ఉందో తెలిపే వాస్తవగాథ ఇది. శిరూర్ అనంతపాల్ గ్రామానికి చెందిన ధన్ రాజ్ షిండేకు మూడెకరాల పొలం ఉంది. ఆరుగురు సంతానం. అందులో పృథ్వీ తప్ప మిగతా ఐదుగురూ అమ్మాయిలే. మూడేళ్ల కిందట తమ పొలంలో దానిమ్మతోట వేయడంతో ధన్ రాజ్ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. పంట చేతికొచ్చే సమయానికి గాలివాన బీభత్సం సృష్టించింది. దాంతో నష్టాల పంరంపర మొదలైంది. గతేడాది వర్షాలు పడకపోవడంతో ఒక్క గింజా పండించలేకపోయాడు, ఈ ఏడాది సాగు సంగతి పక్కన పెడితే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. ఈ క్రమంలో దాదాపు రూ.15 లక్షలు అప్పుచేసిన ధన్ రాజ్.. అప్పుచెల్లించలేననే భయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కరువుకు తోడు కూతురికి రావాల్సిన ఉద్యోగం ఆలస్యమవుతుండటం కూడా ఆయన చనిపోవాలనుకోవడానికి మరో కారణం.



ధన్ రాజ్ పెద్దకూతురు అర్చన (26) సంస్కృతంలో మంచి మార్కులు తెచ్చుకుని రాష్ట్రపతి అవార్డును సాధించింది. ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు వైర్ లెస్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో నియామకం ఆలస్యమవుతోంది. కూతురికి ఉద్యోగం వస్తేనన్నా కొద్దిగా ఆసరా అవుతుందనుకున్న ధన్ రాజ్ అదికాస్తా ఆలస్యం అవుతుండటంతో ఇంకా కలతచెందాడు. అతని రెండో కూతురు సోనాలి (22) గ్రూప్ వన్ పరీక్షలు రాయాలనుకుంటోంది కానీ పరిస్థితుల ప్రభావంతో ఆగిపోయింది. సైన్స్ ఒలింపియాడ్ లో పాల్గొన్న పృథ్వీ ఐఏఎస్ కావడమే తన లక్ష్యమంటున్నాడు. మిగతా ఇద్దరమ్మాయిలు కూడా చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.



'నా పిల్లల్ని సరస్వతీదేవి కరుణించింది గానీ మాకు లక్ష్మీదేవి కటాక్షం దొరకలేదు. ఇప్పటికీ చెబుతున్నా.. మంచి వర్షాలు కురిస్తే ఒక్క పంటతోనే అప్పులన్నీ తీర్చేయగల సత్తా నాకుంది. కానీ దేవుడు కనికరించట్లేదు. ఆ రోజు నా కొడుకు అడ్డుపడకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయమేస్తోంది. ఇక నేను చావను. ఎన్ని కష్టాలెదురైనాసరే నా పిల్లల్ని బాగా చదివిస్తా' అని చెబుతున్నాడు ఆత్మహత్యకు యత్నించి కొడుకు అడ్డుకోవడంతో బతికున్న ధన్ రాజ్ షిండే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top