ఎలా ఓడామప్పా...

ఎలా ఓడామప్పా... - Sakshi

  • బీజేపీ ఆత్మావలోకనం

  •  శికారిపుర ఫలితంపై యడ్యూరప్ప అసంతృప్తి

  •  రాఘవేంద్ర గెలుపు మొత్తం భారాన్ని తనపైనే మోపారని విమర్శ

  •  బళ్లారి, చిక్కొడి స్థానాల్లో స్థానిక నేతలు  సహకరించారన్న ఆరోపణలు

  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉప ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలను సాధించకపోవడానికి కారణాలను బీజేపీ ఆరా తీసింది. పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన ఆత్మావలోకనం సమావేశంలో దీనిపై చర్చ జరిగింది.



    శివమొగ్గ జిల్లా శికారిపురలో పార్టీ విజయం సాధించినప్పటికీ, అంత తక్కువగా మెజారిటీ రావడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప నిష్టూరమాడినట్లు తెలిసింది. తన కుమారుడు ఆ నియోజక వర్గంలో పోటీ చేసినందున, మొత్తం భారాన్ని తనపైనే మోపారని విమర్శించినట్లు సమాచారం.

     

    బళ్లారి గ్రామీణ, చిక్కోడి నియోజక వర్గాల్లో ఎదురైన ఘోర పరాభవంపై సుదీర్ఘ చర్చ జరిగింది. స్థానిక నాయకులు కొందరు కాంగ్రెస్‌కు సహకరించారని సమావేశంలో పాల్గొన్న నాయకులు  ఆరోపించినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఎంపీ తన నియోజక వర్గంలోని అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం ఎదురైన అపజయాన్ని గుణపాఠంగా తీసుకుని పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.



    రాష్ట్రంలో పాలనా వైఫల్యం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఆందోళన కార్యక్రమాలను రూపొందించడంపై కూడా సమావేశంలో చర్చించారు. పోరాట స్వరూపాన్ని తదుపరి సమావేశంలో నిర్ణయించాలని తీర్మానించారు. ప్రతిపక్షంగా మరింత సమర్థంగా పని చేయడానికి శాసన సభ లోపల, వెలుపల అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు.



    తొలుత పార్టీ ఎంపీలతో సమావేశం జరిగింది. అనంతరం ప్రముఖ నాయకులను కూడా ఆహ్వానించి చర్చించారు. ఇదే సందర్భంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా నియమితులైన యడ్యూరప్పను జోషి సత్కరించారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, ఉప నాయకుడు ఆర్. అశోక్ ప్రభృతులు సమావేశంలో పాల్గొన్నారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top