రబ్బర్ స్టాంపును కాను : గవర్నర్

రబ్బర్ స్టాంపును కాను :  గవర్నర్


బెంగళూరు : శాసన, రాజ్యాంగ వ్యవస్థలు నాణేనికి రెండు ముఖాలని, రాజ్ భవన్ ఎప్పటికీ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రం కాకూడదని కొత్త గవర్నర్ వజూభాయ్ రుఢాభాయ్ వాలా అన్నారు. తాను ఈ పదవిలో ఉన్నంత వరకు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతానే తప్ప, ఎవరికో రబ్బర్ స్టాంపులా వ్యవహరించబోనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్తుడైనప్పటికీ, ఇప్పుడు గవర్నర్ కనుక రాజ్యాంగ ఆశయాలను కాపాడాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్ భవన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా, ప్రజల కోసం ఉన్న కార్యాలయంలా తీర్చి దిద్దుతానని చెప్పారు.

 

 ఒక రాష్ట్రం సంక్షేమ ప్రాంతం కావాలంటే ఒకరి నుంచే సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరూ సహకారం అందించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వానికి సూచనలివ్వడంతో పాటు మార్గదర్శనం చేయడం గవర్నర్ కర్తవ్యమన్నారు. ప్రధానికి ఆప్తుడైనందునే తనను గవర్నర్‌గా నియమించారనడం సరికాదని అన్నారు. గుజరాత్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా 18 సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని వెల్లడించారు. కనుక ప్రజా సమస్యలేమిటో తనకు బాగా తెలుసునని చెప్పారు. సంక్షేమ రాష్ట్రం కావాలంటే నిర్ణీత వ్యవధిలో ప్రభుత్వ పథకాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.

 

 గుజరాత్‌లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో ప్రతి శాసన సభ్యుడు, మంత్రి భుజం భుజం కలిపినందున అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు. కర్ణాటకలోనూ అపార సహజ వనరులున్నాయని, ప్రభుత్వం కోరితే సలహాలు ఇస్తానని తెలిపారు. గత గవర్నర్ ఏం చేశారో, రాబోయే గవర్నర్ ఏం చేస్తారో...తనకు అవసరమని, కర్ణాటకలో తాను ఉన్నంత వరకు ప్రజల పక్షాన పని చేస్తానని వివరించారు. రాజ్ భవన్ అంటే కేవలం పుస్తక పఠనానికి, విశ్వ విద్యాలయాల స్నాతకోత్సవాలకు మాత్రమే పరిమితం కాదని అన్నారు.

 

 గవర్నర్ ఎవరికో రబ్బర్ స్టాంపులా పని చేయరాదని చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అన్ని రకాల సహకారాలు అందిస్తానని తెలిపారు. చెడు దారిలో వెళుతుంటే హెచ్చరించడం తన కర్తవ్యమని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ఎవరిపైనో పగ తీర్చుకోవడం....లాంటి ఉద్దేశాలు తనకు లేనే లేవని స్పష్టం చేశారు. కేంద్రానికి తొత్తుగా పని చేయడానికి తనను ఇక్కడికి పంపలేదంటూ, గవర్నర్ పదవిని నిబాయించే సామర్థ్యం తనకు ఉందని చెప్పారు. కర్ణాటకలో ఉన్నంత వరకు సమర్థంగా, నిష్పక్షపాతంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top