ఏపీకి హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ

ఏపీకి హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ - Sakshi

  • హామీ ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల

  • దావోస్‌లో సీఎంతో సమావేశం

  • సాక్షి, అమరావతి: హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తామని మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించినట్లు సీఎం కార్యాలయం (సీఎంవో) తెలిపింది. దావోస్‌లో మంగళవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన సత్య నాదెళ్ల  సంబంధిత ప్రతిపాదనలపై చర్చించినట్లు పేర్కొంది.  సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం బాబు దావోస్‌ పర్యటన వివరాలివీ.. లింక్డ్‌ ఇన్‌ సంస్థను తాము కొనుగోలు చేశామని, దీనిపై సింగపూర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు సత్య నాదెళ్ల సీఎంకు తెలిపారు. ఈ–గవర్నెన్స్, సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో తమతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు.



    వచ్చే ఏడాది జరిగే దావోస్‌ సదస్సు నాటికి హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీలో ప్రగతి సాధించాలని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌) 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన సీఎం మంగళవారం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ సానుకూలతలపై వివరించారు. వర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా చాన్స్‌లర్‌ నికోలస్‌ డక్స్‌తో సీఎం చర్చలు జరిపారు. ఏపీలోని మోరిలో బర్కెలీ వర్సిటీకి చెందిన సోలమన్‌ డార్విన్‌ చేస్తున్న కృషిని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.



    హైపర్‌ లూప్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ కంపెనీ  చైర్మన్‌ బిబాప్‌తో సమావేశమైన బాబు బుల్లెట్, స్పీడ్‌ రైళ్లలో ఆధునిక సాంకేతికత, ఇంధన విని యోగం మొదలైన అంశాలపై చర్చించారు. ఐచర్‌ మోటార్స్‌ ప్రతినిధి సిద్ధార్థ లాల్‌తో సమావేశమై ఏపీకి పెట్టుబడులతో రావాలని కోరారు. ‘ప్రిపేరింగ్‌ ఫర్‌ సిటీ సెంచురీ’ అనే అంశంపై దావోస్‌లో జరుగుతున్న చర్చలో సీఎం ప్రసంగించారు. గ్రీన్‌ అండ్‌ బ్లూ సిటీగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దావోస్‌లో జరిగే సదస్సుకు సీఎం ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైనట్లు సీఎంఓ తెలిపింది. బాబుతో అజీం ప్రేమ్‌జీ, ముఖేశ్‌ అంబాని సమావేశమయ్యారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top