లింగా.. ఓ లింగా..

లింగా.. ఓ లింగా..


మార్మోగిన పెద్దగట్టు



సాక్షి, సూర్యాపేట: లింగా.. ఓ లింగా.. అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ప్రాంగణం మార్మోగింది. జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మొదటి రోజు దేవపెట్టె పెద్దగట్టు దేవాలయానికి చేరింది. అనంతరం యాదవ కులస్తులు గుడిచుట్టూ గంపల ప్రదక్షిణ చేశారు. రెండేళ్ల క్రితం నెలవారం తర్వాత సూర్యాపేట రూరల్‌ మండలంలోని కేసారం గ్రామం లోని మెంతబోయిన, గోర్ల, మున్న వంశీయులు దేవరపెట్టెను తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం దేవరపెట్టెను తీసుకురా వాలని యాదవ కులస్తులను కలెక్టర్, ఎస్పీలు కోరారు. దీంతో రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళ హననూతన్, జేసీ సంజీవరెడ్డి కేసారం గ్రామానికి చేరుకున్నారు.



దేవరపెట్టె ఉన్న మెంతబోయిన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యాదవ కులస్తులు దేవర పెట్టెను తరలించే తంతు నిర్వహించారు. ఆ పెట్టెను యాదవ పూజారులు భుజాలపై పెట్టుకొని ముందు నడవగా, గజ్జెల లాగులు, భేరీ చప్పుళ్లు, కటార్ల విన్యాసాలతో పాటు.. ఓలింగా.. ఓలింగా.. నామస్మరణల మధ్య కేసారం గ్రామం నుంచి కాలినడకన ఆరు కిలోమీట్ల దూరంలో ఉన్న దురాజ్‌ పల్లి (పెద్దగట్టు) దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజ లతో దేవాలయ ప్రవేశం చేశారు. అనంతరం మెంతబోయిన, మున్న, గొర్ల(రెడ్డి) వంశీయులు తెచ్చిన బియ్యం, ఇతర పూజా సామగ్రితో వచ్చిన గంపల ప్రదక్షిణ నిర్వహించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top