'రోహిత్ ఆత్మహత్య'పై మళ్లీ ప్రకంపనలు

'రోహిత్ ఆత్మహత్య'పై మళ్లీ ప్రకంపనలు - Sakshi


హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ  పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ అందించిన రిపోర్టుతో మళ్లీ వివాదం రేగింది. రోహిత్ దళితుడు, కాదని, అతని ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని తేల్చిన కమిటీపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్ వాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీతాజాగా తన రిపోర్టును మంత్రిత్వ శాఖకు అందజేసింది. రోహిత్  ఆత్మహత్యకు  ఎవరూ బాధ్యులుకారని, అది 'దురదృష్టకరమైన సంఘటన' అని తన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు కొన్ని సిఫారసులను కూడా చేసింది. వీటిని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  రోహిత్ దళితుడు కాదని, ఓబీసీ అని తేల్చిన కమిటీ వాస్తవానికి తన రిపోర్టును ఆగస్టు 1న  నివేదించాల్సి ఉంది. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో దాన్ని బహిర్గతం చేయలేదని సమాచారం.  



కమిటీ రిపోర్టుపై అటు విద్యార్థులు, ప్రజాసంఘాలు, అధ్యాపక బృందం మండిపడుతోంది. ఉద్యమానికి సిద్ధమవుతోంది. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కమిటీ వాస్తవాలను తారుమారు చేసిందని ఆరోపిస్తు  జాయింట్ యాక్షన్ కమిటీగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళను దిగనున్నాయి. అటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు వందమంది లెక్చరర్లు, నగరంలో నిర్వహించే 'మహా ధర్నా'కు మద్దతు నివ్వనున్నట్టు ప్రకటించారు. దాదాపు 33  ప్రజా సంఘాలు, ఇతర సంస్థలు వీరి పోరాటానికి అండగా నిలవనున్నాయి. అలాగే మిగిలిన రాష్ట్ర, కేంద్రీయ విశ్వ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.



మరోవైపు రోహిత్ ఆత్మహత్య లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ముఖ్యంగా మనోవేదనకు గురైన విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న ఫిర్యాదుల కమిటీని మరింత పటిష్టం చేయాలని, తక్షణం సహాయం అందించేలా కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలని సిఫారసు చేసింది. విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేసినపుడు ఫిర్యాదు చేసే అవకాశంలేకపోవడం రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా కమిటీ పేర్కొంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top