హిజ్రాలకు ప్రత్యేక కోటా కల్పించాలి

హిజ్రాలకు ప్రత్యేక కోటా కల్పించాలి


టీనగర్: హిజ్రాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఎస్‌ఐగా ఎంపికైన హిజ్రా ప్రిత్తికాయాషిని డిమాండ్ చేశారు. ఐపీఎస్ కావాలన్నదే తన లక్ష్యం అని వివరించారు. ఈ రోడ్‌లో శనివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ప్రిత్తికాయాషిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన సొంతవూరు సేలం అని, ప్రస్తుతం చెన్నై కోవిలంబాక్కంలో నివశిసున్నట్లు తెలిపారు.

 

  ఎస్‌ఐకు పోస్టుకు జరిగిన పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించిన స్థితిలో హిజ్రా కావడంతో ఉద్యోగాన్ని కల్పించలేమని అధికారులు దరఖాస్తును నిరాకరించారని, తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చిందన్నారు. తనను వైద్య పరీక్షల్లో పాల్గొనేందుకు తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆహ్వానించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలో ఓబీసీ విభాగంలో హిజ్రాలకు ఉద్యోగాలు కల్పించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు.

 

 ఇదివరకే ఓబీసీలో అనేక మంది ఉద్యోగాల కోసం వేచివున్న స్థితిలో హిజ్రాలకు పోస్టులు లభించడం కఠినతరమని అన్నారు. అందువల్ల ఈ ఉత్తర్వులను మార్చి హిజ్రాలకు ప్రత్యేక రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. చిన్ననాటి నుంచి ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో చదువుతూ వచ్చానని, ప్రస్తుతం ఎస్‌ఐ కావడానికే పెద్ద పోరాటం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ హిజ్రాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలనేదే తమ కోరికని తెలిపారు. తాను ఎస్‌ఐ అయితే లంచగొండితనం, అవినీతి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతానని అన్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top