తెలంగాణలోనూ జయకేతనం ఎగరవేస్తాం

తెలంగాణలోనూ జయకేతనం ఎగరవేస్తాం - Sakshi

  • కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌

  • దేశమంతా అనుకూల పవనాలే

  • ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్న కేసీఆర్‌

  • సాక్షి, కొత్తగూడెం: పేదల అభ్యున్నతి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటాన్ని ఎవరూ ఆపలేరని, ఇందుకోసం బీజేపీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయా లని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌ రాజ్‌ గంగారామ్‌ పిలుపునిచ్చారు. భద్రాచలం లో రెండురోజులపాటు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో శనివారం ఆయన మాట్లాడారు. దేశమంతటా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇక నుంచి ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ విజయం ఖాయమని, కాంగ్రెస్‌ కంచుకోట అస్సాంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.



    కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా, అవి ప్రజలకు పూర్తిస్థాయిలో చేరడం లేదని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు పరిచేలా పార్టీ కార్య కర్తలు చూడాలని సూచించారు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాం గంలో ఎక్కడా లేదని, రాజ్యాంగంలో లేని అంశాన్ని ఏ ప్రభుత్వమూ అమలు పరచలేదని అన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేసిన ప్రధాని మోదీని ప్రపం చ దేశాలు అభినందిస్తున్నాయని, దేశంలోని అనేక రుగ్మతలకు కారణమైన అవినీతిని అంతమొ దించేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన ప్రభు త్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు కొనియాడుతు న్నారని వివరించారు. తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలతో ప్రజలను మభ్య పెడుతోందని, అంకెల గారడీతో ఆకర్షించే ప్రయత్నం చేస్తూ అరచేతిలో స్వర్గం చూపిస్తోందని విమర్శిం చారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.



    తెలంగాణ–మహారాష్ట్ర మధ్య గోదావరిపై నిర్మిస్తున్న బ్యారేజీ విషయంలో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహకరించిన విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మర్చిపోవద్దని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో  ఆ పార్టీ శాసనమండలి పక్షనేత ఎన్‌.రాంచందర్‌రావు, మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రఘునందన్‌రావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం కామర్స్, మాజీ మంత్రి కె.పుష్పలీల, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం.సత్యనారాయణరెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో  రెండురోజులపాటు  సుధీర్ఘ చర్చలు జరిపి  పలు తీర్మానాలు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top