ఆత్మస్థైర్యాన్ని నింపేదిశగా...

ఆత్మస్థైర్యాన్ని నింపేదిశగా... - Sakshi


- రైతులకు వీడియో సందేశం

- రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, బెంగళూరు:
రాష్ట్రంలో అప్పుల బాధతో రైతన్నలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేదిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇం దులో భాగంగానే రాష్ట్ర సమాచార శాఖ ఆ ధ్వర్యంలో ఓ వీడియో సందేశాన్ని రూపొం దించింది. ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామ య్య ‘ఆత్మహత్యలకు పాల్పడకండి, ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి, ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది’ అంటూ రైతులకు విన్నవించారు. ఈ వీడియో సందేశాన్ని అన్ని మీడియా సంస్థల్లో ప్రసారం చేయడంతో పాటు సామాజిక అనుసంధాన వెబ్‌సైట్‌లలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ చేసింది. ఈ చర్యల ద్వారా రైతుల్లో ఆత్మవిశ్వా సాన్ని నింపి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

వీడియోలో సీఎం ఏమన్నారంటే....

రాష్ట్ర సమాచార శాఖ ‘బదుకు- బేసాయ’ పేరిట రూపొందించిన ఈ వీడియోలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ వీడియోలో సీఎం ఏమన్నారంటే....‘ప్రియమైన రైతులారా, రాష్ట్రంలో ప్రతిరోజు చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలు నన్నెంతగానో బాధిస్తున్నాయి. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు నాకు మాటలు కూడా రావడం లేదు. రాష్ట్రంలోని రైతులందరికీ చేతులు జోడించి నేను కోరుకునేది ఒక్కటే, ఒత్తిళ్లకు భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ, కలలో కూడా ఆత్మహత్య గురించి ఆలోచించకండి.



నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టాను, పేదరికంలోనే పుట్టి పెరిగిన వాడిని, అందుకే రైతుల కష్టసుఖాల గురించి నాకు బాగా తెలుసు, ఏడాదంతా కష్టించి పండించిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోతే రైతులు ఎంతగా కుంగిపోతారో నాకు బాగా తెలుసు, అయినా కూడా మీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు, ఒక ఆత్మబంధువుగా, ఒక సన్నిహితునిగా, ముఖ్యంగా మీ అందరి ఆత్మీయ ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని కోరేది ఇదే, రైతుల అప్పులకు సంబంధించి వారిపై ఒత్తిడి తీసుకురావద్దని ఇప్పటికే కమర్షియల్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ, సహకార బ్యాంకులకు సైతం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మా ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది’. అని సిద్ధరామయ్య ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. కాగా, మంత్రులు రోషన్‌బేగ్, డి.కె.శివకుమార్, కృష్ణబేరేగౌడ, ఎస్.ఆర్.పాటిల్, మహదేవ ప్రసాద్‌లు సైతం రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ వీడియోలో కోరారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top