పెళ్లికి సిద్ధంగా లేనంటూ.. యువతి వెబ్సైట్

పెళ్లికి సిద్ధంగా లేనంటూ..యువతి వెబ్సైట్


 ఇప్పటి వరకూ విద్యా, ఉద్యోగాల వివరాల సమాచారం కోసం వెబ్సైట్ లను ప్రారంభించటం చూశాం తాజాగా ఓ యువతి తాను అప్పుడే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా లేనంటూ ఓ వెబ్సైట్ను ప్రారంభించటం విశేషం. అందులో విశేషం ఏముందనుకుంటున్నారా.. ఆ వెబ్సైట్ ను 2 లక్షల మంది వీక్షించడంతో పాటు 11 వేల లైక్లు వచ్చాయి.



వివరాల్లోకి... తమిళనాడుకు చెందిన ఇంజనీర్ ఇందుజా పిళ్లై  (23) ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది. తల్లిదండ్రులు ఇందుజాకు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. అయితే దక్షిణాదికి చెందిన అందరు అమ్మాయిల్లా ఆమె ఆలోచించలేదు. ఎందుకంటే అన్ని వెబ్సైట్ లలో అమ్మాయి వయసు, ఎత్తు, సంపాదన లాంటి వివరాలు అప్లోడ్ చేస్తారు. ఇటువంటి వాటితో నాకెలాంటి సంబంధం లేదు అన్నట్టుగా భావించిన ఇందుజా తనకోసం ఓ సరికొత్త వెబ్సైట్ marry.indhuja.com ను ప్రారంభించింది.



'నా వయసు 23 ఏళ్లు. నేను ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేను. ప్రస్తుతం ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా కొంచెం సమయం కావాలి. భారత్లో 30 ఏళ్లు పైబడితే అమ్మాయిలకు పెళ్లవదు అని మాట్లాడుతుంటారు. ఇటువంటివి ఎలా కల్పిస్తారో?' అని ఇందుజా తన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.



'నేను వెబ్సైట్ ప్రారంభించిన విషయం తెలిసి మొదట మా అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు. మెల్లమెల్లగా వారికి విషయం అర్థం అయింది. నేను చెప్పిన అంశాలలో నిజం ఉందని వారు గ్రహించారు. మా అమ్మగారు ప్రస్తుతం ఈ విషయంలో ధైర్యంగా ఉన్నారు' అని ఇందుజా చెప్పారు. తన ఆలోచనలపై ఎన్నో విమర్శలు, భిన్నాభిప్రాయాలు వస్తాయని, కొద్ది మంది మాత్రమే బ్లాగ్ చూస్తారని తొలుత ఇందుజా పిళ్లై భావించింది. అయితే ఆ వెబ్సైట్కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆనందంతో పాటు ఆమె ఆశ్చర్యానికి లోనవుతుంది.



'నార్త్ ఇండియా నుంచి చాలా కామెంట్లు వస్తుండగా దక్షిణాది నుంచి మాత్రం స్పందన చాలా తక్కువగా ఉంది' అని ఇందుజా చెప్పుకొచ్చింది. మీడియా వాళ్లు మా బంధువులను ఈ అంశంపై ప్రశ్నించగా వారు ఎటువంటి జవాబివ్వలేదని ఆమె చెప్పింది. ఏది ఏమైతేనేం, మొత్తానికి ఇందుజా పిళ్ళై  తాను అనుకున్నది సాధించింది. అదేనండీ వివాహానికి సంబంధించి తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఇందుజా తెలిపింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top