చేతులు, కాళ్లు కట్టివేసి విద్యార్థినిపై హత్యాచారం

చేతులు, కాళ్లు కట్టివేసి విద్యార్థినిపై హత్యాచారం - Sakshi


 మానవ మృగాలు బాలికతో ఆడిన రాక్షస క్రీడ పురుష జాతికే మాయని మచ్చలా మిగిలిపోయింది. భయంతో, బాధతో విలవిల్లాడుతున్న బాలిక  కాళ్లు, చేతులు కట్టేసి మృగాల కంటే క్రూరంగా ప్రవర్తించారు. ఆ తరువాత నిర్దయగా మద్యం బాటిల్‌తో కొట్టి చంపేశారు. మద్యం మత్తులో మునిగిన కొందరు దుండగులు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న బాలికపై సాగించిన వికృత క్రీడ ఇది. పాఠశాలకు వెళ్లిన కుమార్తె, మరుసటి రోజు ఉదయం శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమైంది. ఏ పాపం తెలియని ఆ బాలికపై జరిగిన అఘారుుత్యానికి గుండెలు చెరువయ్యేలా రోదించారు.

 

వేలూరు: గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానుష సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో సంచలనం రేపింది. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ కూలీ. ఇతని రెండో కుమార్తె కీర్తిక(11) మార్చనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన కీర్తిక రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు.



పాఠశాల నుంచి ఇంటికి వచ్చే దారిలోని పెరియాంకుప్పం వద్ద ఉన్న మామిడితోటలో కీర్తిక మృతదే హాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కేవీ కుప్పం పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసన్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తలపై బాటిల్‌తో కొట్టిన  గాయాలున్నట్లు గుర్తించారు.

 

మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు ఉండడాన్ని పరిశీలించారు. విద్యార్థిని సైకిల్ మామిడి తోట పక్కన ఉన్నట్లు కనుగొన్నారు. విద్యార్థిని పాఠశాల నుంచి వస్తుండగా, కొందరు అడ్డుకుని మామిడి తోటలోకి లాక్కెళ్లినట్లు భావిస్తున్నారు. విద్యార్థిని స్కూల్ బ్యాగును తోటలో ఒక పక్క విసిరి వేశారు. విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టి వేసి, అత్యాచారం చేసి, తరువాత బాటిల్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా కీర్తిక స్నేహితులు ముగ్గురి వద్ద విచారణ చేస్తున్నారు.  డీఐజీ విచారణ: విషయం తెలుసుకున్న డీఐజి తమిళ్ చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి  సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ రిటో అనే విద్యార్థి వద్దకు వెళ్లింది. అనంతరం అక్కడ నుంచి విద్యార్థి ఇంటిని చుట్టి దురైమూలం గ్రామం వద్దకు వెళ్లి నిలిచిపోయింది. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top