ఏరు దాటితేనే ఎవుసం

ఏరు దాటితేనే ఎవుసం

కొండూరు రైతుల దయనీయ స్థితి

పంటల సాగుకు అష్టకష్టాలు పడుతున్న రైతులు

ప్రత్యామ్నాయం చూపించాలని ప్రభుత్వానికి వినతి

 

రాయపర్తి : వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోని వెనక భాగం కొండూరు గ్రామాల రైతులు పంటల సాగు కోసం ఓ యజ్ఞమే చేయాల్సి వస్తోంది. విత్తనాలు, ఎరువులు దొరకకో.. వర్షాలు సరిగ్గా కురవకో వారు కష్టాలు పడుతున్నారనుకుంటే పొరపాటే. పుష్కలంగా నీరు ఉంది.. పంటలు కూడా బాగానే పండుతున్నాయి. అయినా గ్రామ రైతుల కష్టాలు ఎందుకంటే.. వారు పొలానికి వెళ్లాలన్నా, పంట ఉత్పత్తులను ఇంటికి తెచ్చుకోవాలనుకున్నా పడవ లేదా తెప్ప నడపడం వచ్చి ఉండాలి లేదంటే ఈతలో ప్రావీణ్యులై ఉండాలి! ఇదంతా ఎందుకని మీ సందేహమా!? అయితే ఈ కథనం చదవాల్సిందే...

 

2006లో నిర్మాణం

రాయపర్తి మండలంలో మైలారం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను 2006లో నిర్మించారు. అప్పట్లో కొంత భూమిని సేకరించి సంబంధిత రైతులకు పరిహారం చెల్లించారు. ఇక మిగతాది మెట్ట భూమి అని.. ఎవరికీ ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు. ఇలాంటి రైతులు 40 నుంచి 50 మంది వరకు ఉండగా వీరికి 200 ఎకరాల భూమి ఉంది. గ్రామానికి, ఈ పొలాలకు మధ్యలో ఉన్న భూమికి సంబంధించిన రైతులకు పరిహారం చెల్లించిన అధికారులు దానిని రహదారిగా మార్చారు. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులతో 2013 వరకు రిజర్వాయర్‌లోకి పెద్దగా నీరు చేరలేదు. దీంతో రైతులు సజావుగా తమ పొలాలకు వెళ్లి సాగు చేసుకున్నారు. ఇంతలో 2013లో ఎస్సారెస్పీ నీటిని రిజర్వాయర్‌లోకి వదలడంతో ఆయా రైతులకు దారి మూసుకుపోయింది. ఇంకేముంది చేసేదేం లేక తెప్పలపై పొలాలకు వెళ్తూ సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రైతులంటే సొంత పొలం కావడంతో అటోఇటో తిప్పలు పడి వెళ్తుండగా.. తిరిగి పంట ఉత్పత్తులు తెచ్చుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక పొలాల్లో కలుపుతీత, కోతకు కూలీలను పిలిస్తే వాగు దాటడం సమస్యగా ఉన్నందున ఎవరూ రావడం లేదు. ఫలితంగా పంట ఉత్పత్తులు తీసుకురాలేక, మొలకలు వస్తుంటే చూడలేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

ఎమ్మెల్యే, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా..

మూడేళ్ల క్రితం ఎస్సారెస్పీ కాలువల ద్వారా రిజర్వాయర్‌ నింపినపుడు కొండూరు రైతులకు సమస్య ఎదురైంది. దీంతో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి కలెక్టర్‌ కిష¯ŒSకు వీరు తమ గోడు వెళ్లబోసుకోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అలాగే మిగిలిపోగా.. ఈ ఏడాది రిజర్వాయర్‌ నిండడంతో రైతుల సమస్య పునరావృతమైంది. కిలోమీటరు మేర ప్రవహిస్తున్న నీటిలో నుంచి తెప్పల సాయంతో పంట పొలాల వద్దకు వెళ్తున్న తమ సమస్య పరిష్కారానికిబ్రిడ్జి నిర్మించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో తమ భూములు కూడా స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికి స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

 

పశువులను అమ్ముకున్నా..

పంట పొలాలకు పశువులను తోలుకొని పోవాలంటే ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో పశువులను అమ్ముకున్నాను. నాకు ఐదు ఎకరాలు భూమి ఉంది. అందులో మొక్కజొన్న, పత్తి, వరి వేశాను. పంటలు కోశాక ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యపై దృష్టి సారించి బ్రిడ్జి నిర్మించాలి.

వేల్పుల బుచ్చయ్య, రైతు

 

మాకు చావే శరణ్యం

నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను వేశాను. చేతికి వచ్చిన పంటలను తీసుకొచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. తెప్పలను వేసుకువెళ్లి పంటలను చూసుకుని వస్తున్నా, పంటలను ఇంటికి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తేనే మా సమస్య తీరుతుంది. లేదంటే చావే శరణ్యం

-ఆకుతోట సుధాకర్, రైతు

 

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top