‘ఉరి’ కౌగిట రైతు ఊపిరి..!


సాక్షి, ముంబై: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాలవర్షాలకు లేదా నీటిఎద్దడితో దెబ్బతింటుండటం రైతుల పాలిట శాపంగా మారాయి. దీంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక  మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు ఆత్మహత్యల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఓ వైపు కరువు, మరోవైపు అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు.



గత రెండు నెలల్లో సుమారు 125 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు.   దీన్నిబట్టి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందన్నది స్పష్టమవుతోంది. ఓ వైపు పంట కోసం తీసుకున్న అప్పులు వడ్డీతో తడిసిమోపెడు కాగా మరోవైపు ఇంట్లో తినేందుకు కూడా తిండి గింజలు లేని పరిస్థితి. దీనికితోడు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించడంలేదు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.



దీంతో రైతులను ఆదుకునే విషయంపై ప్రభుత్వం కీలకనిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అకాల వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది. ఇలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోతే ఆత్మహత్యల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.



యావత్మాల్ జిల్లాలో రోజుకో ఆత్మహత్య..!

రాష్ట్రంలో అత్యధికంగా యావత్మాల్ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లో ఇక్కడ 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా, ఈ జిల్లాలో గడిచిన 11 నెలల్లో 224 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడినవారందరు దాదాపు ఉరి వేసుకునో లేదా విషం తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.



అమరావతి జిల్లాలో 45 రోజుల్లో 20 మంది...

అమరావతి జిల్లాలో గత 45 రోజుల్లో అప్పులబాధ తాళలేక 20 మంది ఆత్మహత్య పాల్పడ్డారు.  అయితే వీరిలో కేవలం ఒక్కరైతును మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేందుకు యోగ్యుడిగా గుర్తించింది. మిగతా వారందరికి నష్టపరిహారం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది.



అకోలా జిల్లాలో నెలరోజుల్లో 11 ఆత్మహత్యలు

అకోలా జిల్లాలో గడిచిన నెల రోజుల్లో 11 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అకోలా, పరతూర్ తాలూకాకి చెందినవారే అధికంగా ఉన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top